- బ్రిటీష్ కొలంబియాలో దుండగుల కాల్పులు
ఒట్టావా: కెనడాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే నగరంలో ఉన్న ఓ వాల్‌మార్ట్ స్టోర్ బయట దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పక్కా ప్లాన్‌తో జరిగిన ఈ దాడి వెనుక వ్యవస్థీకృత నేర ముఠాల హస్తం ఉందని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. నవంబర్ 15 రాత్రి జరిగిన ఈ కాల్పుల్లో డెల్టా టౌన్‌షిప్‌కు చెందిన గగన్‌ప్రీత్ (గారీ) రెహల్ (23), సుఖ్‌జీత్ కౌర్ (24) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) వెల్లడించింది.
రెహల్‌పై గతంలో అక్రమ ఆయుధాల కేసులు ఉన్నాయని, కౌర్‌కు కెనడాలో పెద్దగా పరిచయాలు లేవని విచారణలో తేలింది. ఘటన జరిగిన రాత్రి 10:51 గంటలకు సమీపంలో ఓ కారు దగ్ధమైనట్లు సమాచారం అందిందని, అది నిందితులదేనని ఐహెచ్ఐటీ సార్జెంట్ ఫ్రీడా ఫాంగ్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
