డీలర్లకు రవాణా శాఖ డెడ్‌‌‌‌ లైన్..కొత్త వాహనాలకూ వారం రోజుల్లో నంబర్ ప్లేట్లు పెట్టాల్సిందే : రవాణా శాఖ

డీలర్లకు రవాణా శాఖ డెడ్‌‌‌‌ లైన్..కొత్త వాహనాలకూ వారం రోజుల్లో నంబర్ ప్లేట్లు పెట్టాల్సిందే : రవాణా శాఖ
  •     జాప్యం చేస్తే ట్రేడ్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌పీ) అమర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్న షోరూమ్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించింది. ఈ మేరకు  ట్రాన్స్‌‌‌‌పోర్టు అధికారులు శనివారం హైదరాబాద్‌‌‌‌లో  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్లేట్లు అమర్చకపోయినా, వాటి వివరాలను వాహన్ పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌డేట్ చేయకపోయినా షోకాజ్ నోటీసులు, జరిమానాలు విధిస్తామని తెలిపారు. ట్రేడ్ సర్టిఫికెట్ల సస్పెన్షన్‌‌‌‌తో పాటు డీలర్ లాగిన్‌‌‌‌ను బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. 

నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లు వారం రోజుల్లోగా ప్లేట్లు అమర్చి, వివరాలను పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌డేట్ చేయాలని ఆదేశించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసిన యజమానులు తమకు హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌పీ లేదా ఆర్సీ కార్డు అందని పక్షంలో వాహన యజమానులు తమ డీలర్లను లేదా సంబంధిత ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో వాహన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు  6, 10, 330 వాహనాలు రిజిస్ట్రేషన్ అయితే...ఇందులో 4, 56 , 298 వాహనాలకు డీలర్లు నెంబర్ ప్లేట్లను అమర్చారు. ఇంకా 1,54,032  వాహనాలకు ప్లేట్లు అమర్చాల్సి ఉందని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.