- 18 లక్షల మంది ఐదేండ్లలోపు చిన్నారులకు చుక్కల మందు
- 7,428 బూత్ లు, 245 మొబైల్ టీమ్ లు, 245 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలియో నిర్మూలన లక్ష్యంగా సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే – 2026లో భాగంగా దీనిని చేపట్టారు. గ్రేటర్ లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేస్తారు. మొత్తం 18,01,698 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కల బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (బీఓపీవీ) అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ వంటి పొరుగు దేశాల్లో పోలియో కేసులు ఇంకా నమోదవుతున్నాయి. అక్కడి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్రం ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
రేపు, ఎల్లుండి ఇంటింటికీ..
పోలియో చుక్కలు వేసేందుకు 7,428 బూత్ లు, 245 మొబైల్ టీములు, 245 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఆదివారం టీకాలు పొందని చిన్నారులను గుర్తించి రేపు, ఎల్లుండి(23, 24 తేదీల్లో) ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో 25న కార్యక్రమం కొనసాగుతుంది. యాచకులు, సంచార జాతులు, వలస కార్మికుల కుటుంబాల చిన్నారులకు టీకాలు వేస్తారు.
అపార్ట్మెంట్లలో డిజిటల్ స్క్రీన్లతో ప్రచారం..
పల్స్ పోలియోపై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక ప్రచారం చేపట్టింది. 1,165 నివాస సముదాయాలు, హై-రైజ్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని 6,172 డిజిటల్ స్క్రీన్లపై మూడు రోజుల పాటు సందేశాలను ప్రదర్శిస్తున్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులకు నేరుగా సమాచారం చేరవేసి, పిల్లలకు టీకాలు వేయించేలా ప్రోత్సహిస్తున్నారు. కార్యక్రమ పర్యవేక్షణలో 761 రూట్ సూపర్ వైజర్లు, 1,709 ఏఎన్ఎంలు, 5,682 ఆశా వర్కర్లు, 5,655 అంగన్ వాడీ కార్యకర్తలు పాల్గొంటున్నారు. వీరితో పాటు మహిళా మండలి సభ్యులు, మెప్మా, సెర్ప్ ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోనున్నారు.
18 ఏళ్లుగా పోలియో రహిత రాష్ట్రం..
గత 18 ఏళ్లుగా తెలంగాణ పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగుతోందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) మిషన్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ
పేర్కొన్నారు.
పోలియో చుక్కలు వేయించాలి
హైదరాబాద్ సిటీ, వెలుగు: తల్లితండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సూచించారు. హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా నవంబర్ 22న పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 0–5 ఏండ్ల వయస్సు గల 5,22,814 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 2,626 పోలియో బూత్లు, ప్రయాణికుల కోసం రైల్వే, బస్, మెట్రో స్టేషన్లలో 38 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నవంబర్ 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేంద్రాల్లో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు.
