- 26న సీఎం చంద్రబాబు సమక్షంలో సమర్పణ
- తిరుమల చరిత్రలోనే అరుదైన విరాళంగా రికార్డ్
హైదరాబాద్, వెలుగు: తిరుమల వేంకటేశ్వరస్వామివారికి ఓ భక్తుడు అపూర్వమైన కానుక సమర్పించనున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 160 కిలోల బంగారు ఆభరణాలను శ్రీవారికి విరాళంగా ఇవ్వనున్నారు. వీటి విలువ దాదాపు రూ. 250 కోట్లు ఉంటుందని అంచనా. ఈ నెల 26న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఆభరణాలను టీటీడీకి అందజేయనున్నట్లు సమాచారం. శ్రీవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆభరణాలను తొమ్మిది సెట్లుగా, మొత్తం 45 రకాలుగా తయారు చేయించినట్లు తెలుస్తోంది.
తిరుమల శ్రీవారికి భక్తులు బంగారం, వజ్రాలు, నగదు రూపంలో భారీ విరాళాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఒకే భక్తుడు ఏకంగా 160 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనుండటం విశేషంగా మారింది.
ఈ విరాళం తిరుమల చరిత్రలోని భారీ కానుకల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఇంత భారీ విరాళం అందజేస్తున్న భక్తుడు ఎవరు? ఆభరణాలను ఏ రూపంలో తయారు చేయించారు? స్వామివారికి ఎప్పుడు అలంకరిస్తారు? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. నవంబర్ 26న ఏపీ సీఎం లేదా టీటీడీ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
