- ఫ్రాన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం
- పారిస్ సమీపంలో సఫ్రాన్ ఇంజిన్ల ఫ్యాక్టరీ పరిశీలన
- ఇన్వెస్ట్ తెలంగాణ సమిట్‌లో ఎంవోయూకు చాన్స్
- ఇప్పటికే హైదరాబాద్‌లో లీప్ ఎంఆర్‌వో, విడిభాగాల యూనిట్లు
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా ఎదుగుతున్న రాష్ట్రానికి మరో భారీ అంతర్జాతీయ పెట్టుబడి రానుంది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ‘సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్’ రాష్ట్రంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం పారిస్ సమీపంలోని ఎవ్రీ–కార్బెల్‌లో ఉన్న సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తయారీ కేంద్రాన్ని పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తితో కలిసి సందర్శించారు.
సంస్థ ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లారెంట్ మజౌ, రొటేటింగ్ పార్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ జూలియన్ డి’ఒరాజియో తదితరులతో చర్చలు జరిపారు. బోయింగ్, ఎయిర్‌బస్ వంటి దిగ్గజ సంస్థలకు విమాన ఇంజిన్లు సరఫరా చేసే సఫ్రాన్, ఈ రూ.4 వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి వచ్చే నెల 7 నుంచి 9 వరకు జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో ఎంవోయూ కుదుర్చుకునే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో ఇప్పటికే..
సఫ్రాన్ ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ నెలకొల్పిందని భట్టి గుర్తుచేశారు. విమాన ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటైన ‘లీప్ ఎంఆర్‌వో’తో పాటు లీప్ ఇంజిన్ల రొటేటింగ్ పార్ట్స్ తయారీ, ఎలక్ట్రికల్ అండ్ పవర్ యూనిట్లను సంస్థ విజయవంతంగా నడుపుతోందని చెప్పారు. పర్యటనలో పౌర, రక్షణ విమానాల ఇంజిన్ల అసెంబ్లీ ప్రక్రియను, అత్యాధునిక టెక్నాలజీతో విడిభాగాల తయారీ విధానాలను డిప్యూటీ సీఎం పరిశీలించారు.
