- హార్మూజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా కొనసాగుతున్న పతనం
- 2027 చివరికల్లా 70 డాలర్లకు పడుతుందని అంచనా
- తగ్గనున్న రవాణా ఖర్చులు
న్యూయార్క్: గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు వరుసగా మూడో వారమూ భారీగా పడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత తొలిసారిగా ప్రపంచ ఆయిల్ సరఫరా మళ్లీ మిగులు స్థాయికి చేరింది. మరోవైపు యుద్ధం "దాదాపు ముగిసింది" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేయడంతో ఆయిల్ ధరలు పడుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 92 డాలర్ల దగ్గర ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో 120 డాలర్ల వరకు ధరలు పెరిగిన విషయం తెలిసింది.
ఇరాన్ దాడులు చేస్తున్నా..
గత కొన్ని రోజులుగా ప్రపంచ ఆయిల్ రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ దాడులను ముమ్మరం చేసినప్పటికీ, ఆయిల్ ధరలు పెరగకపోవడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో హార్మూజ్ గుండా సాధారణ రవాణా సాధ్యం కాదని లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ (ఎల్ఎస్ఈజీ) విశ్లేషకులు చెబుతున్నప్పటికీ, వివిధ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు, ఇతర ఇంధన వనరుల వైపు మళ్లడంతో ఆయిల్ సరఫరా తిరిగి పుంజుకుంది. దీంతో ఆయిల్ సరఫరాను అడ్డుకుని ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెద్దామనుకున్న ఇరాన్ ప్రధాన యుద్ధ వ్యూహం బలహీనపడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు ఈ దేశం సైనిక చర్యలను మరింత పెంచే ప్రమాదం ఉందని అమెరికా సంస్థ క్విన్సీ ఇన్స్టిట్యూట్ హెచ్చరించింది.
ఆయిల్ ధరలు మరింత దిగువకు..
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 2027 చివరి నాటికి బ్యారెల్‌కు 70 డాలర్ల స్థాయికి తగ్గే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ వెల్లడించింది. ఒపెక్ -ప్లస్ యేతర దేశాల నుంచి ఆయిల్ ఉత్పత్తి పెరగడం, చైనాలో డిమాండ్ తగ్గడం వల్ల ప్రపంచ మార్కెట్ మిగులు స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ‘‘హార్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం గుండా క్రూడాయిల్ రవాణా యుద్ధానికి ముందు నాటి స్థాయిలో 90 శాతానికి చేరుకుంది. అమెరికా–ఇరాన్ మధ్య 2027 జూన్ నాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ప్రస్తుత శీతాకాలంలో ఎల్ఎన్జీ ధరలు అధికంగా ఉన్నా, అమెరికా, ఖతార్ ఉత్పత్తి పెరగడంతో 2027 చివరిలో గ్యాస్ ధరలు తగ్గుతాయి” అని జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ వివరించింది. ఆయిల్ ధరలు తగ్గితే రవాణా ఖర్చులూ తగ్గుతాయి.
ఆయిల్ డిమాండ్‌కు దెబ్బ
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఇంధన రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) పేర్కొంది. ఇరాన్ యుద్ధం వల్ల ఈ ఏడాది పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి సుమారు 2.8 బిలియన్ బ్యారెళ్ల ఆయిల్, 60 బిలియన్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. 1970ల నాటి ఆయిల్ సంక్షోభాన్ని మించిన ఈ పరిణామంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. హార్మూజ్ జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు వివిధ దేశాలు కొత్త పైప్లైన్ల నిర్మాణం, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ మార్పుల వల్ల 2035 నాటికి ప్రపంచ ఆయిల్ డిమాండ్ 4 శాతానికి పైగా తగ్గి రోజుకు 97 మిలియన్ బ్యారెళ్లకు, 2050 నాటికి 85 మిలియన్ బ్యారెళ్లకు పరిమితమవుతుందని ఐఈఏ అంచనా వేసింది.
