- ప్రతి తల్లి, టీచర్, పౌరుడు బాధ్యత తీసుకుంటేనే కట్టడి
- డ్రగ్స్ సమస్యపై ప్రధాని మోదీ కూడా దృష్టిపెట్టారు
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ మహమ్మారి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మీదుగా తెలుగు రాష్ట్రాలకు విస్తరించి.. హైదరాబాద్‌లోని బస్తీల నుంచి ఐటీ కారిడార్ల దాకా పాకిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం సామాజిక సమస్య కాదని, దేశ భవిష్యత్తు, యువతు, కుటుంబాలకు సంబంధించిన తీవ్రమైన ముప్పు అని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన ‘సిటీ కన్వెన్షన్ ఆన్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా –హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ మెగా అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, జయప్రకాశ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
తల్లి, టీచర్ చైతన్యం తేవాలి: కిషన్ రెడ్డి
ఇది రాజకీయ సభో, ఒక పార్టీ సభో కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ డ్రగ్స్ సమస్యపై దృష్టిపెట్టారన్నారు. పెట్టుబడులకు, డేటా సెంటర్లకు, ఐటీ రంగానికి భారత్ సేఫ్ డెస్టినేషన్‌గా మారిందని, అలాంటి దేశానికి పెద్ద ఆస్తి అయిన యువశక్తి డ్రగ్స్ బారిన పడి నిర్వీర్యం కాకూడదన్నారు. మత్తుకు బానిసలైన వారు తల్లిదండ్రులను కొట్టడం, దొంగతనాలు, హత్యలు చేయడం పెరిగిందన్నారు. కుటుంబంలో తల్లి, బస్తీలో ప్రముఖులు, స్కూల్లో టీచర్, ప్రతి పౌరుడు బాధ్యత తీసుకుని డ్రగ్స్‌ను అరికట్టాలన్నారు.
యువతను వీక్ చేసే కుట్ర: రాంచందర్ రావు
యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చి భారత్‌ను బలహీనపరిచేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. దేశ సరిహద్దు రాష్ట్రాల్లో డ్రగ్స్‌ను సులభంగా అందుబాటులోకి తెచ్చి యువకుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ‘నేషన్ ఫస్ట్’ సంకల్పంతో స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, ఖేలో ఇండియాలాగే ఇప్పుడు భావితరాలను కాపాడేందుకు ‘నషా ముక్త్ భారత్’ పిలుపునిచ్చారన్నారు.
డ్రగ్స్ కేసులపై శ్వేతపత్రం ఇవ్వాలి: ఏలేటి
వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో దేశాన్ని నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిపిన ప్రధాని మోదీ, ఉగ్రవాదం, నక్సలిజం తరహాలోనే నార్కో టెర్రరిజంపై యుద్ధం ప్రకటించారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ముందుగా ఉచితంగా ఇచ్చి యువతను బానిసలుగా మార్చే డ్రగ్స్ ముఠాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
పిల్లలు డ్రగ్స్ వాడుతున్నట్టు తెలిస్తే తండ్రి హెచ్చరించాలి: గరికపాటి
పిల్లలను ఎంత బాగా పెంచినా, వంశాలు ఎంత గొప్పవైనా మింగేయడానికి డ్రగ్స్ మహమ్మారి సిద్ధంగా ఉందని గరికపాటి నరసింహారావు హెచ్చరించారు. తల్లిదండ్రులకు పిల్లలపై ఉండే అతి మమకారమే ప్రథమ శత్రువని అన్నారు. పురాణాల్లో సగర మహారాజు తన 16 ఏండ్ల కొడుకు అసమంజసుడు తప్పు చేస్తే సాయంత్రానికే ఇంట్లోంచి గెంటేశాడని గుర్తుచేశారు. ‘తొలుదొల్తన్ తన మిత్రులందనుపగా తోచున్ నశాభ్యాసము’ అన్నట్లు పార్టీల్లో మిత్రులను సంతోషపెట్టేందుకు మద్యంతో మొదలై మత్తుమందుల్లోకి వెళ్తున్నారని చెప్పారు. పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారని తెలిసిన మొదటి రోజే తండ్రి సీరియస్‌గా హెచ్చరిస్తే మూడో రోజుకే సెట్ అవుతారన్నారు.
