- బంగారం ధరలు పడిపోవడంపై ప్రధాని మోదీ
- ఏడాది పాటు బంగారం కొనొద్దన్న పిలుపును గుర్తుచేసిన పీఎం
- లాల్ బహదూర్ శాస్త్రి పిలుపుతో పోల్చి చెప్పిన ప్రధాన మంత్రి
- వారం రోజుల వ్యవధిలో 9% పడిపోయిన పసిడి ధర
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1.25 లక్షలు
లక్నో: అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పడిపోతున్న వేళ, అవసరం లేకపోతే ఏడాది పాటు బంగారం కొనొద్దని తాను ఇచ్చిన పిలుపును ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. తన సలహా పాటించడం వల్లే ప్రజల డబ్బు ఆదా అయిందని అన్నారు. శనివారం లక్నోలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘అవసరం లేకపోతే ఏడాది పాటు బంగారం కొనొద్దని దేశ ప్రజలను కోరాను. నాలాంటి సామాన్యుడు అడిగితే ప్రజలు బంగారం తక్కువ కొన్నారు, ధరలు తగ్గాయి. మోదీ జీ.. మీరు చెప్పారు, మేం విన్నాం, మా డబ్బు మిగిలిందని ఇప్పుడు ప్రజలు నాతో అంటున్నారు’ అని చెప్పారు. 1960ల్లో ఒక పూట భోజనం మానేయాలని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపును దేశం పాటించినట్లే, ఇప్పుడూ దేశ ప్రజలు అదే చొరవ చూపారన్నారు.
వారంలో 9 శాతం పతనం
వరుసగా ఐదు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ వారంలో దాదాపు 9 శాతం పడిపోయాయి. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 25 వేల 080 రూపాయలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం లక్షా 14 వేల 650 రూపాయలు పలికింది.
హైదరాబాద్‌లోనే పిలుపు
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు పెరిగి దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పడుతున్న సమయంలో, ఈ ఏడాది మేలో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ప్రధాని ఈ పిలుపునిచ్చారు. బంగారం కొనుగోళ్లకు విదేశీ మారకం భారీగా ఖర్చవుతోందని, దేశ ప్రయోజనాల కోసం ఏడాది పాటు బంగారం కొనొద్దని, ఇంధన వినియోగం తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అప్పుడు కోరారు.
ఆ తర్వాత కేంద్రం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. సెప్టెంబర్ 1న ఓ వీడియో సందేశంలోనూ అవసరం లేకపోతే బంగారం కొనొద్దని మోదీ మళ్లీ కోరారు. అనవసర బంగారం కొనుగోళ్లను తగ్గించడాన్ని స్వదేశీ ఉద్యమంతో ముడిపెట్టారు.
