- ఇన్చార్జిగా నియమితులయ్యాక తొలిసారి హైదరాబాద్‌కు బీఎం సందీప్
- హాజరుకానున్న సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు
- మధ్యాహ్నం పీసీసీ సమావేశం.. అసమ్మతి నేతలపై డిస్కషన్
- అటెండ్ కావాలని రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డికి ఏఐసీసీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన బీఎం సందీప్ ఆదివారం తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. రెండ్రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. ఇందులో కొత్త ఇన్చార్జ్ బీఎం సందీప్ తోపాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, పీఏసీ సభ్యులైన సీనియర్ నేతలు మాత్రమే పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్న నేతలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి కొంత కాలంగా సీఎంకు, పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీళ్లిద్దరిపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇప్పటికే హైకమాండ్ కు నివేదించారు. అవి కొత్త ఇన్చార్జీ సందీప్ దృష్టికి వెళ్లాయి. ఈ క్రమంలోనే వీరిద్దరినీ పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరుకావాలని ఏఐసీసీ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ ఇన్చార్జ్ సందీప్ ఈ ఇద్దరితో వేర్వేరుగా భేటీ కానున్నారు. పీఏసీలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్యులు కానందున వారు దీనికి హాజరయ్యే అవకాశం లేదు. దీంతో చాలా మంది సభ్యులు ఈ మీటింగ్ లో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పే వీలుంది. ఈ ఇద్దరి వ్యవహారశైలిపై చర్చ అనంతరం వారు చెప్పే అభిప్రాయాలు, మీటింగ్ లో సభ్యులు చేసే ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవాలో పీఏసీ మీటింగ్ నిర్ణయిస్తుంది. మొదట షోకాజ్ నోటీసు ఇచ్చి, ఆ తర్వాతే చర్యలకు ఉపక్రమించవచ్చని పీసీసీలో చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ ఈ ఇద్దరి విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
రేపు మంత్రులతో విడివిడిగా..
పీఏసీ సమావేశం అనంతరం మధ్యాహ్నం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం (పీఈసీ) జరగనుంది. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ పరిస్థితి, నేతల మధ్య సమన్వయం, కాంగ్రెస్ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల అమలు వంటి విషయాలపై ఇందులో చర్చించనున్నారు. రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించనున్నారు. సోమవారం ఉదయం మంత్రులతో విడివిడిగా, తర్వాత మధ్యాహ్నం నుంచి డీసీసీ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాల అధ్యక్షులతో కొత్త ఇన్చార్జ్ సందీప్ వేర్వేరుగా భేటీ కానున్నారు. అనంతరం తిరిగి ఆయన ఢిల్లీ వెళ్లిపోనున్నారు. మళ్లీ ఈ నెల 27న హైదరాబాద్ రానున్న బీఎం సందీప్.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వేర్వేరుగా భేటీ కానున్నారు.
