2027లో దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్..

2027లో  దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్..
  • వేగంగా ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులు: అశ్వినీ వైష్ణవ్
  • సూరత్ నుంచి వాపి వరకు ఫస్ట్ సెక్షన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడి

ముంబై: దేశంలో మొట్టమొదటి హై స్పీడ్ రైలు సేవలు 2027లో ప్రారంభమవుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముంబై అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ (మొత్తం 508 కి.మీ)లో భాగంగా సూరత్ నుంచి వాపి(98 కి.మీ) వరకు ఫస్ట్ సెక్షన్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. 

ముంబై వరకు పూర్తి కారిడార్ దశలవారీగా అందుబాటులోకి వస్తుందని వివరించారు. శుక్రవారం ఆయన ‘సబ్‌‌‌‌స్టాక్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ నాటికి 456 కి.మీ పిల్లర్ల పని, 371 కి.మీ వయాడక్ట్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు.

అలాగే, 4 పర్వత సొరంగాల తవ్వకం పూర్తవగా, 8 స్టేషన్లలో సివిల్ పనులు ముగిశాయని పేర్కొన్నారు. సబర్మతి, సూరత్, థానే డిపోల్లో పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. గంటకు 280 కి.మీ  వేగంతో ప్రయాణించే స్వదేశీ 'బీ28' బుల్లెట్ ట్రైన్ తయారీని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) సంస్థలు చేపట్టాయని.. 2027 మధ్య నాటికి ట్రాక్ ట్రయల్స్ నిర్వహిస్తామని మంత్రి వివరించారు.

దేశంలోనే తొలి అండర్‌‌‌‌సీ రైల్ టన్నెల్
మహారాష్ట్రలో కారిడార్ కోసం నిర్మిస్తున్న 21 కి.మీ సొరంగంలో 7 కి.మీ భాగం థానే క్రీక్ వద్ద సముద్రం అడుగున నిర్మితమవుతోందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది దేశంలోనే తొలి సముద్రగర్భ రైలు సొరంగమని.. దీని కోసం 2026 జూలైలో విక్రోలి, సావ్లీ నుంచి 2 భారీ టన్నెల్ బోరింగ్ మెషీన్లను రంగంలోకి దించామన్నారు. 96 మీటర్ల పొడవు, 3వేల టన్నుల బరువున్న ఈ యంత్రాలు 4 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటాయని వివరించారు.