సందపల్లి చెరువుకు హైడ్రా రక్షణ: నాలుగు ఎకరాల ఆక్రమణల తొలగింపు

సందపల్లి చెరువుకు హైడ్రా రక్షణ: నాలుగు ఎకరాల ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండిపల్లి గ్రామంలోని సందపల్లి చెరువులో హైడ్రా ఆక్రమణలను తొలగించింది. చెరువు భూములను ఆక్రమించి ప్రహరీలు నిర్మించడంతోపాటు పచ్చిక బయళ్లుగా మార్చేందుకు చేపట్టిన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది. మొత్తం 76 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సందపల్లి చెరువు లోపలి భాగంలో ఆక్రమణలు జరుగుతున్నాయన్న సమాచారంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పరిధిలో నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించారు. శనివారం చెరువు భూమిలో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో సుమారు 100 గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇంటితోపాటు పక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డును కూల్చివేశారు. చెరువు భూమిని భవిష్యత్​లో ఎవరూ అక్రమించకుండా సుమారు 1,600 మీటర్ల మేర ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చెరువు భూమిగా గుర్తించేలా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.