శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోగి’. కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. నవంబర్ 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలో అన్ని పాటలు రాసిన గీత రచయిత చంద్రబోస్ ఇలా ముచ్చటించారు. ‘భోగి’ అనేది తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రం. ఆ జీవితాన్ని అత్యంత స్వచ్ఛమైన మాటల్లో, యాసలో రాసే అవకాశం దక్కింది. ఆ పనిలో సఫలమయ్యానని భావిస్తున్నా.
సినిమా కవి ప్రతి మాండలికంలోనూ ఒదిగిపోవాలని నేను నమ్ముతా. గతంలో గోదావరి, రాయలసీమ యాసలను పరిశీలించి, నేర్చుకుని పాటలు రాశా. కానీ దీనికి ఆ అవసరం లేదు. నా మూలాల్లో ఆ తడి ఇంకా ఉంది. 13 ఏళ్ల వయసుకే నా గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చేశా. కానీ అప్పటికే నేర్చుకున్న భాష, యాస ఇంకా నా లోపల ఉన్నాయి.
మాతృ మాండలికంలో పాటలు రాసే అవకాశం రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్ర దర్శకుడు సంపత్ నందికి సాహిత్యంపై మంచి పట్టు ఉంది. ‘ఎగిలివారంగ’ పాటలో ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామీణుల జీవితాన్ని చూపించాలని అన్నారు. అయితే ప్రతి పాట కూడా ఒక కథలాగా ఉండాలనేది నేను పాటించే నియమం. పాటకు ఒక అందమైన ప్రారంభం, కొనసాగింపు, ముగింపు ఉండాలి. ఆ రోజుల్లో ప్రజల జీవితాలు ఎలా ఉండేవనేది కళ్లకు కట్టినట్టుగా ఈ పాట సాహిత్యంతో చెప్పా. అందుకే చాలామందికి పర్సనల్గా కనెక్ట్ అవుతోంది.
భీమ్స్ ప్రజల సంగీత దర్శకుడు. నా స్ఫూర్తితో వచ్చానని చెబుతుంటాడు. నేనంటే చాలా అభిమానం. తనతో కలిసి పనిచేయడం సంతోషం. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. రెండు బిట్ సాంగ్స్, మూడు ఫుల్ సాంగ్స్. ప్రతి పాట సందర్భానికి అనుగుణంగా ఉంటుంది. ఓ పాటకు నేను ముందుగా సాహిత్యం రాయగా, తర్వాత అతను కంపోజ్ చేశాడు. ముందు సాహిత్యం రాసి, ఆ పాటను స్వరపరిస్తే ఎక్కువ కాలం నిలుస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం.
నేను రాయడానికి ఎక్కువ సమయం తీసుకున్నది ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాట. కంపోజింగ్, మార్పులు చేర్పులు కలిసి 19 నెలలు పట్టింది. మంచి పాటలు ఎన్ని రాసినా దానికే ఆస్కార్ ఎందుకు వచ్చిందనే దానికి ఒక చిన్న విశ్లేషణ ఉంది. ఇది ప్రేమ గీతం కాదు, బంధాల మధ్య ఉండే గీతం కాదు, తాత్విక గీతం కాదు. ఒక ఆడి పాడే పాట. మిగతా పాటల కంటే ఈ పాట వందకి వంద మార్కులు కొట్టింది. ఆ ఏడాది దీనిని మించి ఉర్రూతలూగించిన పాట ఏదీ లేదు. బహుశా నా సహనానికి అవార్డు వచ్చిందేమో. (నవ్వుతూ). 31 ఏళ్ల నా సాహితీ యజ్ఞానికి భగవంతుడు ఇలా కరుణించాడేమో!
పాటకు భావం అనేది ముఖ్యం. ఆ భావం ప్రజల భాషల్లో ఉండాలి. ప్రజల్లో చైతన్యం రగిలించాలంటే ప్రజల్లో ఒకరిగా ఉండాలి. వారి వాడుక భాషలో మనం రాయాలి. పాటను సామాన్యుడికి చేరువ చేయాలంటే మధ్యలో దళారి ఉండకూడదు.. వాళ్ల భాషలోనే మనం పాట రాయాలి. ఇక ప్రస్తుతం రౌడీ జనార్ధన, విశ్వంభర, రామ్ పోతినేని సినిమా, షారుక్ ఖాన్ గారి హిందీ సినిమా, శ్రీ విష్ణు సినిమా, ‘బరి’ చిత్రాలకు రాస్తున్నా.
