‘ఆపరేషన్ సిందూర్’ వేళ పాక్‌‌‌‌ కు చైనా అండ..అమెరికా కాంగ్రెస్ కమిటీ నివేదిక వెల్లడి

‘ఆపరేషన్ సిందూర్’ వేళ పాక్‌‌‌‌ కు చైనా అండ..అమెరికా కాంగ్రెస్ కమిటీ నివేదిక వెల్లడి
  •     భారత్‌‌‌‌ను వ్యూహాత్మక సవాలుగా భావిస్తున్న డ్రాగన్

వాషింగ్టన్: ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్‌‌‌‌కు చైనాకు అండగా నిలిచిందని అమెరికా కాంగ్రెస్‌‌‌‌కు చెందిన కీలక కమిటీ స్పష్టం చేసింది. భారత్ ఎదుగుదలను అడ్డుకునే విస్తృత వ్యూహంలో భాగంగానే పాక్ కు సహకారం అందించిందని తెలిపింది. ఇండియాను దీర్ఘకాలిక వ్యూహాత్మక సవాలుగా చూస్తున్న బీజింగ్.. సైనిక, ఆర్థిక, సముద్ర రంగాల్లో ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఢిల్లీ ప్రాబల్యాన్ని కట్టడి చేయాలని ప్రయత్నిస్తోందని హెచ్చరించింది. ‘యూఎస్- చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్’ (యూఎస్ సీసీ) నవంబర్ 18న విడుదల చేసిన 2026 వార్షిక నివేదికలో ఈ కీలక అంశాలను పొందుపరిచింది. 

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణల సందర్భంగా, చైనా నేరుగా యుద్ధంలోకి దిగకుండానే పాకిస్తాన్‌‌‌‌ను బలోపేతం చేసే ఎత్తుగడ వేసిందని కమిటీ పేర్కొంది. ఆధునిక ఆయుధాలతో పాటు, చైనా ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారం అందించారని, ఉపగ్రహ మద్దతు కూడా లభించిందన్న అంశాలను నివేదిక ప్రస్తావించింది. అలాగే, భారత వైమానిక దళంలోని ఫ్రాన్స్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాలపై ప్రతికూల ప్రచారం చేస్తూ, చైనాకు చెందిన జె-10 విమానాలను గొప్పగా చూపేందుకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో తప్పుడు ప్రచారాలు నడిచాయని తెలిపింది.

బహుముఖ వ్యూహంతో చైనా ఒత్తిడి

సరిహద్దుల్లో సైనిక ఒత్తిడి పెంచడం, అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌లోని తవాంగ్ సమీపంలో ద్వంద్వ వినియోగ మౌలిక సదుపాయాలు నిర్మించడం, హిందూ మహాసముద్రంలో జిబౌటి, గ్వాదర్, హంబన్‌‌‌‌టోటా, చిట్టగాంగ్ వంటి రేవుల ద్వారా నౌకాదళ విస్తరణ చేయడం వంటి చర్యల ద్వారా భారత్‌‌‌‌ను చుట్టుముట్టే ప్రయత్నం జరుగుతోందని నివేదిక విశ్లేషించింది. ఆర్థికంగానూ ప్రత్యేక ఎరువులు, టన్నెల్ బోరింగ్ యంత్రాలు, రేర్ ఎర్త్ అయస్కాంతాలు, బ్యాటరీ సాంకేతిక బదిలీలపై పరిమితుల ద్వారా భారత్ తయారీ రంగానికి ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు జరిగాయని పేర్కొంది. 

భారత్‌‌‌‌తో బంధం బలోపేతం చేయాలి

ఆసియాలో శక్తి సమతుల్యతను తీర్చిదిద్దడంలో, చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడంలో భారత్ పాత్ర అత్యంత కీలకమని కమిషన్ నొక్కిచెప్పింది. అమెరికా మిత్రపక్ష కూటమిలో లేనప్పటికీ, చైనాతో దీర్ఘకాలిక పోటీని గణనీయంగా ప్రభావితం చేయగల అతికొద్ది శక్తులలో భారత్ ఒకటని అభిప్రాయపడింది. భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే ముందుకు సాగుతుందని స్పష్టం చేసిన కమిషన్.. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు అమెరికా మరింత ముందుకు రావాలని సూచించింది. రక్షణ సాంకేతికత, నిఘా సమాచార మార్పిడి, హిందూ మహాసముద్రంలో చైనా నౌకా కదలికల  సంయుక్త పర్యవేక్షణ, సప్లై చైన్, తయారీ, ఔషధ రంగాల్లో భారత్‌‌‌‌తో సహకారాన్ని మరింత గాఢం చేయాలని వాషింగ్టన్‌‌‌‌కు సిఫార్సు చేసింది.