ఇండియాను ఉదాహరణగా తీసుకోవాలని హితవు
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచేందుకు భారత్‌ను ఉదాహరణగా చూపిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా భారత్ తరహాలో వేగంగా వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. భారత్ ప్రస్తుతం సాధిస్తున్న 7% వృద్ధిని ట్రంప్ కొనియాడారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీ రేట్ల విధానంలో మార్పులు చేస్తే, దేశం 15 నుంచి 20 శాతం వృద్ధిని సాధించగలదని ఆయన పేర్కొన్నారు. గతంలో భారత్ ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అని విమర్శించిన ట్రంప్.. తాజాగా భారత్ వృద్ధిని ఉదహరించడం చర్చనీయాంశంగా మారింది.
ఫెడరల్ రిజర్వ్పై అసంతృప్తి
ఆసియా పర్యటన ముగిసిన తర్వాత మొదటిసారి బహిరంగంగా మాట్లాడిన ట్రంప్, అమెరికా ఫెడరల్ రిజర్వ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్థిక గణాంకాలు బలంగా ఉన్నప్పటికీ, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో రాజకీయ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘‘వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఫెడ్ రాజకీయంగా వ్యవహరించడమే. ఫెడ్ తీరు సరిగా లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
గ్రీన్ స్పాన్ కు మెచ్చుకోలు
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాలన్న తన వాదనను సమర్థించుకోవడానికి మాజీ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అలాన్ గ్రీన్‌స్పాన్‌ను ఆయన ఉదహరించారు. ఆర్థిక గణాంకాలు బాగున్నప్పుడు గ్రీన్‌స్పాన్ వడ్డీ రేట్లను తగ్గించేవారని, కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోందని అసహనం వ్యక్తంచేశారు. ఫెడ్ తన విధానాన్ని మార్చుకుంటే అమెరికా వృద్ధి వేగవంతం అవుతుంది, దేశ అప్పులను కూడా త్వరగా చెల్లించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ‘మనం 4% కాకుండా 15 లేదా 20% జీడీపీని సాధించగలం’ అని ఆయన చెప్పారు.
అలా చేస్తే 15 నుంచి 20% జీడీపీ..
‘‘మీరు భారత్‌ను గమనిస్తే, అక్కడ తక్కువ వడ్డీ రేట్లు, 7% జీడీపీ ఉన్నాయి. మనం కూడా అటువంటి విధానాన్ని అనుసరిస్తే 14, 15 లేదా 20 శాతం వరకు జీడీపీ సాధించవచ్చు’’ అని ట్రంప్ వాదించారు. అయితే అమెరికా 15-–20 శాతం వృద్ధి సాధిస్తుందన్నది ట్రంప్ వ్యక్తిగత అంచనానేనని, ఇది ధృవీకరించిన అంచనా కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
