ఓ వైపు వందల ఏండ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కుతుబ్‌షాహీ సమాధులు.. మరోవైపు ఎత్తైన పచ్చని చెట్ల కొమ్మల్లో కిలకిలరావాలు చేసే రంగురంగుల పక్షులు.. చరిత్రను చూస్తూనే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పక్షుల ప్రపంచంలో విహరించే అరుదైన అవకాశం హైదరాబాద్ బర్డ్ లవర్స్ కు నవంబర్ 22న దక్కనుంది. వరల్డ్ హెరిటేజ్ వీక్ సందర్భంగా ఈ నెల 19 నుంచి 25 వరకు తెలంగాణ పర్యాటక శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా కుతుబ్‌షాహీ సమాధుల వేదికగా ‘వింగ్స్ ఓవర్ హెరిటేజ్’ పేరుతో బర్డ్ వాచింగ్, హెరిటేజ్ వాక్ నిర్వహిస్తోంది.
106 ఎకరాల్లో చరిత్ర, ప్రకృతి
సిటీలో 106 ఎకరాల్లో విస్తరించిన కుతుబ్‌షాహీ సమాధులు ప్రత్యేక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి. 16, 17వ శతాబ్దాల్లో నిర్మించిన 40 సమాధులు, 23 చిన్న మసీదులతో కలిపి దాదాపు 70 పురాతన కట్టడాల సమాహారం ఇది. అంతేకాదు, సమాధుల మధ్య ఉన్న ఎత్తైన పచ్చని చెట్లు ఎన్నో పక్షి జాతులకు ఆవాసంగా మారి ఈ ప్రాంతాన్ని ‘బర్డ్స్ హాట్‌స్పాట్’గా నిలిపాయి. సమాధుల పక్కనే ఉన్న దక్కన్ పార్క్ పచ్చదనం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పురాతన బావులు, పచ్చని ఉద్యానవనాలు, వేలాది పక్షులతో ఉండే ఈ ప్రాంతాన్ని రోజూ వందలాది మంది సందర్శిస్తుంటారు.
ఒకే చోట చరిత్ర, ప్రకృతి పాఠాలు
కుతుబ్‌షాహీ పాలకుల కాలం నాటి సమాధులు, వాటి నిర్మాణ శైలి, చారిత్రక విశేషాలను హెరిటేజ్ వాక్‌లో తెలుసుకోవచ్చు. అదే సమయంలో చెట్లపై పక్షులను గమనిస్తూ ప్రకృతి ఒడిలో విహరించొచ్చు. ఇలా ఒకేచోట చరిత్ర, ప్రకృతి, జీవవైవిధ్యాన్ని పరిచయం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇక్కడ 82 రకాల పక్షులు
గతంలో చేసిన పరిశీలనల్లో కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో 82 రకాల పక్షి జాతులు నమోదయ్యాయని పర్యాటక శాఖ ఎకో టూరిజం ప్రాజెక్ట్ ఆఫీసర్ కె.సుమన్ చెప్పారు. షిక్రా, కింగ్‌ఫిషర్, గ్రీన్ బీ ఈటర్, పసుపు పిట్ట (గోల్డెన్ ఓరియోల్), సన్‌బర్డ్స్, రామచిలుకలు (పారాకీట్స్), డ్రోంగోలు (ఏట్రింతలు) వంటి పక్షులు ఇక్కడ కనిపిస్తాయని తెలిపారు. పక్షులను వాటి రంగులు, ఆకారాలు, కూతల ఆధారంగా గుర్తించడం, వాటి ఆవాసాలు, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్రను తెలుసుకోవడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పారు.
పక్షులను మ్యూజియంలలో చూసే రోజు రావొద్దు
పక్షులు ప్రకృతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, పరాగ సంపర్కం, విత్తనాల వ్యాప్తి, పర్యావరణ సమతుల్యతకు అవి కీలకమని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరు చెప్పారు. పక్షుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచకపోతే పక్షులను కూడా మ్యూజియంలలో చూడాల్సిన రోజు వస్తుందని అన్నారు. బర్డ్ వాక్కు వచ్చినవారు చూసిన పక్షులను పాకెట్ గైడ్‌తో గుర్తించొచ్చని, పక్షులను ఎలా చూడాలి, ఎలా గుర్తించాలి, ఏ పక్షి ఎలా కూస్తుంది వంటి విషయాలను నిపుణులు వివరిస్తారని తెలిపారు. స్థానిక, స్థానికేతర చెట్లు, వాటిపై పక్షుల ఆవాసాలు, చెట్ల ఉపయోగాలు, ఔషధ విలువల గురించి కూడా చెబుతామన్నారు. వారసత్వ కట్టడాల పరిరక్షణను జీవవైవిధ్యంతో అనుసంధానించడంతో పాటు విద్యార్థులు, యువత, కుటుంబాలకు ప్రకృతిపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు.
చరిత్రకు పక్షుల కిలకిల..
పేరు: వింగ్స్ ఓవర్ హెరిటేజ్
తేదీ: నవంబర్ 22, ఆదివారం (ఉదయం)
వేదిక: కుతుబ్‌షాహీ సమాధులు, హైదరాబాద్
నిర్వహణ: తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్
పురాతన కట్టడాల రాళ్లలో చరిత్రను చూడటమే కాదు.. చెట్లపై ప్రకృతి పలికే పాటనూ వినాలి! వారసత్వ సంపదను కాపాడుకుంటూనే జీవవైవిధ్యాన్నీ పరిరక్షించుకోవాలి. చరిత్రకు రెక్కలు తొడిగి, ప్రకృతిని పర్యాటకానికి చేరువ చేస్తున్న ఈ ప్రయత్నం సిటీకి మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది.
