ఉత్తర తెలంగాణ భక్తుల కొంగుబంగారం, కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఒక అపురూప ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 60 ఏళ్ల తర్వాత అంజన్న మూలవిరాట్టుపై పేరుకుపోయిన చందనాన్ని తొలగించడంతో, స్వామివారు తమ అసలు సిసలైన 'నిజరూపం'లో భక్తులకు దర్శనమిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ అటవీ ప్రాంతపు గుట్టల నడుమ, సుమారు 500 ఏళ్ల క్రితం ఆంజనేయస్వామి స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది.
అప్పటి నుంచి ప్రతి మంగళ, శనివారాలతో పాటు విశేష పర్వదినాల్లో భక్తులు సమర్పించే చందనం, సింధూరంతో స్వామివారిని అలంకరించడం ఇక్కడి సంప్రదాయంగా వస్తోంది. ఇలా దశాబ్దాలుగా లేపనం చేసిన చందనం ఏకంగా ఆరు అంగుళాల(అర అడుగు) మందం మేర విగ్రహాన్ని పూర్తిగా కప్పేసింది. దీంతో స్వయంభూ మూర్తి అసలు రూపాన్ని భక్తులు పూర్తిస్థాయిలో దర్శించుకోలేకపోయేవారు. ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చందనోత్సవానికి ఎట్టకేలకు ఆలయ ఈఓ అంజన రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో నవంబర్ 15న అంకురార్పణ జరిగింది.
పంచవృక్ష పరికరాలు.. పంచ నదుల జలాలు..
ఈ నెల 15 నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు అత్యంత నియమనిష్ఠలతో చందనం తొలగింపు ప్రక్రియను నిర్వహించారు. వివిధ పీఠాల జీయర్లు, వేద పండితులు, రుత్వికుల మంత్రోచ్ఛారణల మధ్య దేవతా వృక్షాలైన మామిడి, జువ్వి, మర్రి, రావి, మేడి చెట్ల కలపతో ప్రత్యేకంగా తయారు చేసిన పనిముట్లతో అర్చకులు అత్యంత సున్నితంగా చందనాన్ని తొలగించారు. ఈ క్రమంలో స్వామివారి విగ్రహం పైనుంచి ఏకంగా 99 కిలోల 720 గ్రాముల చందనం వెలువడడం విశేషం. అనంతరం దేశంలోని పవిత్ర నదులైన గంగ, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కావేరి జలాలతో మూలవిరాట్టుకు మహాభిషేకం నిర్వహించారు.
ఆనాటి సాక్షులు ఇద్దరే.. ఇకపై 12 ఏళ్లకోసారి!
కొండగట్టులో చివరిసారిగా 60 ఏళ్ల క్రితం అంజన్నకు చందనోత్సవం జరిగింది. నాటి అపురూప ఘట్టంలో పాల్గొన్న అర్చకులు మారుతి, అనంతస్వామి ఈ చందనోత్సవానికి హాజరు కావడం విశేషం. 60 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ మహద్భాగ్యం కలగడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు, ఇంత సుదీర్ఘ విరామం కాకుండా ఇకపై ప్రతి 12 ఏళ్లకు ఒకసారి(పుష్కర కాలానికి) చందనం తొలగింపు చేపట్టాలని జీయర్ స్వాముల సూచన మేరకు ఆలయ అధికారులు, అర్చకులు ప్రాథమికంగా నిర్ణయించారు.
-
40 రోజులపాటు నిజరూప దర్శనం
ఇన్నాళ్లూ చందనపు అలంకరణలో చూసిన స్వామివారిని, ఇప్పుడు సహజ సిద్ధమైన రాతిపై స్వయంభూగా కొలువైన నిజరూపంలో చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని 12 ప్రముఖ దేవాలయాల నుంచి అంజన్నకు పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 20న భద్రాచలం నుంచి పట్టువస్త్రాలు రాగా, రాబోయే రోజుల్లో యాదగిరిగుట్ట(నవంబర్ 24), వేములవాడ (28), సికింద్రాబాద్ గణేష్ ఆలయం (డిసెంబర్ 1), బాసర (5), కొమురవెల్లి (8), ధర్మపురి (12), వరంగల్ భద్రకాళి (15), బల్కంపేట ఎల్లమ్మ (19), కీసరగుట్ట (22), కర్మన్ఘాట్ (26), సికింద్రాబాద్ మహంకాళి (29) ఆలయాల అర్చకులు, వేదపండితులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శనివారం నుంచి డిసెంబర్ 29 వరకు రాబోయే 40 రోజుల పాటు భక్తులకు అంజన్న నిజరూప దర్శన భాగ్యం కలగనుంది.
కరీంనగర్/కొండగట్టు, వెలుగు
