సహజ విపత్తుల్లో భూకంపాలు తీవ్రమైనవి. అకస్మాత్తుగా భూమి కంపించడం వల్ల ఏర్పడే భూకంప తరంగాలు కొన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల అధిక ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. భూకంప తరంగాలు ప్రయాణించే వేగాన్ని బట్టి భూమి కంపించడం వల్ల భవనాలు కూలుతాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం 6.0 నుంచి 8.0 మధ్య తీవ్రత ఉన్న భూకంపాలు దాదాపు 96 వరకు సంభవిస్తున్నాయని అంచనా వేయడమైంది. భారతదేశ భూభాగాన్ని, భూకంప వైపరీత్యాలకు గురయ్యే తీవ్రత దృష్ట్యా సెస్మిక్‌జోన్ మ్యాపింగ్‌లో జోన్ 2 నుంచి 5 వరకు వర్గీకరించడమైంది.
జోన్ 5: ఇది అత్యంత తీవ్రమైన భూకంప మండలం. తీవ్ర ముప్పు ఉన్న జోన్‌గా ప్రస్తావించారు. మెర్కాలీ స్కేలుపై భూకంప తీవ్రత 9 కలిగిన ప్రాంతాలు ఈ మండలం పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ పరిధిలోకి ఈశాన్య రాష్ట్రాలు మొత్తం, గుజరాత్‌లోని కచ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లోని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు వస్తాయి.
జోన్4: మెర్కాలీ స్కేలుపై భూకంప తీవ్రత 8గా నమోదయ్యే ప్రాంతాలు ఈ జోన్ పరిధిలో ఉంటాయి. ఇది భూకంప తీవ్రత అధికంగా ఉండే రెండో జోన్‌గా పరిగణిస్తారు. ఈ మండలం పరిధిలో జమ్మూకాశ్మీర్ నుంచి హిమాచల్‌ప్రదేశ్ వరకు ఉన్న ఉత్తర మేఖలలో భాగాలు, ఢిల్లీ, హర్యానాలోని కొన్ని భాగాలు, మహారాష్ట్రలోని కోయనా ప్రాంతం ఉన్నాయి.
జోన్3: మెర్కాలీ స్కేలుపై భూకంప తీవ్రత 7గా నమోదయ్యే ప్రాంతాలు ఈ మండలం పరిధిలోకి వస్తాయి. దీనిని మితమైన నష్టం కలిగిన జోన్‌గా పరిగణిస్తారు. ఈ జోన్ పరిధిలోకి రాజస్తాన్‌లోని కొన్ని భాగాలతో కలిపి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోని కొంకణ్ తీరం, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు వస్తాయి.
జోన్ 2: మెర్కాలీ స్కేలుపై 7 కంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ఈ జోన్లోకి వస్తాయి. ఇది అత్యల్ప నష్టం కలిగించే జోన్‌గా పరిగణిస్తారు. ఇందులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని ప్రాంతాలు వస్తాయి.
భూకంప తీవ్రత ప్రాంతాలు
హిమాలయ ప్రాంతాలు: హిమాలయ ప్రాంతంలో పర్వతోద్భేదన ప్రక్రియ వల్ల భూకంపాలు తరచూగా వస్తుంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌ల్లో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. వీటి తీవ్రగా 8గా నమోదువుతుంది.
ఉత్తర మైదాన ప్రాంతం: ఇక్కడ భూకంపాలు రావడానికి హిమాలయ పర్వతాల్లో వచ్చే భూకంపాలు కారణం. ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బిహార్ ఈ ప్రాంతంలో ఉంటాయి.దక్కన్ కోస్తా ప్రాంతం, తీర ప్రాంతాలు: దక్కన్ ప్రాంతం స్థిరమైంది. అయినా స్థానికంగా ఉండే పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ఇక్కడ భూకంపాలు వస్తాయి.
మెర్కాలీ స్కేలు
భూకంప తీవ్రతను, ప్రకంపనాల మొత్తాన్ని తెలియజేసే పరికరం మెర్కాలీ స్కేలు. ఈ స్కేలులో ఉండే విభాగాలు 12(I - –-XII). వీటిని రోమన్ సంఖ్యలతో సూచిస్తారు. Iవ అంకె తీవ్రతను జంతువులు(పాములు) పసిగడతాయి. IIవ అంకె తీవ్రతను మానవుడు పసిగడతాడు. XIIవ అంకె మహా ప్రళయాన్ని సూచిస్తుంది.
- వెలుగు, ఎడ్యుకేషన్
