పొద్దుపొద్దునే పొగమంచు ఎంతపనిచేసింది.. బస్సు ఢీ కొట్టి కారు నుజ్జునుజ్జు

పొద్దుపొద్దునే పొగమంచు ఎంతపనిచేసింది.. బస్సు ఢీ కొట్టి కారు నుజ్జునుజ్జు

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు-కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సిరిసిల్ల సమీపంలోని చంద్రంపేట జంక్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఢీకొన్న ధాటికి ధ్వంసమైన కారు నుజ్జునుజ్జయింది.

108 సిబ్బంది, స్థానికులు కలిసి కారులో ఇరుక్కున్న డ్రైవర్ను కాపాడారు. గడ్డపారతో కారు భాగాలను తొలగించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారు. తెలంగాణలో ఆదివారం తెల్లవారుజామున పొగమంచుతో చాలా జిల్లాల్లో ఇలానే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కున్నారు.

పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ వ్యాప్తంగా కూడా పొగ మంచు  కమ్ముకుంది. పొగమంచు రహదారులను, పట్టణాన్ని కమ్మి వేసి దట్టమైన పొగ మంచు ఏర్పడడంతో రహదారులు కనపడక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణం కొనసాగించారు. 

పొగ మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలు జరుగుతాయేమో అని ప్రయాణికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్ల పైకప్పులు, రహదారులు, వాహనాలు మంచుతో కమ్ముకు పోవడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.