IPL 2027కి ధోనీ రిటైర్మెంట్.. సీఎస్‌కే బ్రాండ్ పరిస్థితి వాల్యూ ఏంటి? 

IPL 2027కి ధోనీ రిటైర్మెంట్.. సీఎస్‌కే బ్రాండ్ పరిస్థితి వాల్యూ ఏంటి? 

MS Dhoni Retires: తమిళనాడులో రజనీకాంత్ సినిమా మొదటి రోజు మొదటి ఆటను ఫ్యాన్స్ 'తలైవర్ దర్శనం' అని పిలుచుకుంటారు. సరిగ్గా కొన్ని కిలోమీటర్ల దూరంలోని చెపాక్ (MA చిదంబరం స్టేడియం)లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ అక్కడ జరిగే జాతరను ఫ్యాన్స్ 'తలా దర్శనం' అని ఆరాధించారు. రాంచీలో పుట్టిన ఒక కుర్రాడు, ఒక్క తమిళ పదం కూడా సరిగ్గా మాట్లాడలేకపోయినా MGR, రజనీకాంత్‌ల తరహాలో చెన్నై దత్తపుత్రుడిగా, 19 ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో కీలకంగా మారిపోయాడు. ఇప్పుడు ధోనీ ఆటగాడిగా రిటైర్ అయి CSK మెంటార్‌గా మారిన వేళ.. ధోనీ లేని CSKను అభిమానులు, స్పాన్సర్లు ఎలా ఆదరిస్తారు? అనే ప్రశ్న ఇప్పుడు క్రీడా, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తలా ప్రీమియం తగ్గితే CSK బ్రాండ్ విలువకే దెబ్బ: 

* హౌలిహాన్ లోకీ (Houlihan Lokey) నివేదిక ప్రకారం, 2022లో $146 మిలియన్లుగా ఉన్న CSK బ్రాండ్ విలువ 2026 నాటికి $244 మిలియన్లకు చేరింది. 

* 4వ స్థానానికి పడిపోయిన CSK: 2023, 2024లో నంబర్-1గా ఉన్న CSK బ్రాండ్ విలువ 2026లో కేవలం 3.8 శాతం వృద్ధితో 4వ స్థానానికి పడిపోయింది (RCB $312M, MI $264M, KKR $245M).

* స్పాన్సర్ల ఆందోళన: ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు స్పాన్సర్‌షిప్ ఇవ్వడం అంటే పరోక్షంగా ధోనీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ పొందడమేనని వాల్యుయేషన్ నిపుణులు  పేర్కొన్నారు. ఇప్పుడు ధోనీ మైదానంలో ఆడకపోవడం, కేవలం డగౌట్‌లో మెంటార్‌గా ఉండటంతో ఆ 'ప్రీమియం వ్యాల్యూ' తగ్గే ఛాన్స్ ఉంది.

* విజయాలే కీలకం: గతంలో CSKకు గెలుపు ఒక బోనస్‌గా ఉండేది, కానీ ధోనీ లేని జట్టుకు ఇకపై గెలుపు అనేది అత్యవసరం అని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

చెపాక్‌ను వీడని ఫ్యాన్స్.. వేరే స్టేడియాల మాటేంటి?: 

* ధోనీ క్రేజ్ వల్లే దేశంలోని ఏ స్టేడియంలో CSK ఆడినా అది చెపాక్‌లా పసుపు మయమయ్యేది. ఇతర రాష్ట్రాల్లోని అభిమానులు కేవలం నంబర్-7 జెర్సీ, హెలికాప్టర్ షాట్ కోసమే CSKకు సపోర్ట్ చేసేవారు. అయితే చెన్నై అభిమానులు మాత్రం ధోనీ లేకపోయినా తమ ప్రేమ తగ్గదని తేల్చి చెబుతున్నారు. 

* శరీరం మట్టికి.. ప్రాణం CSKకు: ధోనీ లేకపోయినా నేను CSKకే మద్దతిస్తానని చెన్నై ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మనం చనిపోయే వరకు జెర్సీపై నంబర్-7 మారదు.. 19 ఏళ్లు ధోనీ మనకు కప్పులు ఇచ్చాడు, ఇకపై ఆ కప్పు గెలిచి తలాకు కానుకగా ఇస్తామని చెప్పుకొచ్చారు. 

* టికెట్ల బ్లాక్ మార్కెట్ తగ్గొచ్చు: ధోనీ బ్యాటింగ్ చూసేందుకు టికెట్లకు భారీ డిమాండ్, బ్లాక్ మార్కెటింగ్ జరిగేదని, ఇప్పుడు అసలైన క్రికెట్ అభిమానులకు టికెట్లు సులభంగా దొరుకుతాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మెంటార్‌గా 15 ఏళ్లు.. రుతురాజ్ గైక్వాడ్‌పైనే భారం: 

సీనియర్ జర్నలిస్ట్ అయాజ్ మెమన్ విశ్లేషణ ప్రకారం.. ధోనీని మెంటార్‌గా నియమించడం CSK తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. గతంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆటగాడిగా రిటైర్ అయి 15 ఏళ్లు కోచ్‌గా ఉన్నట్లే, ధోనీ కూడా మరో 12–15 ఏళ్లు CSK మెంటార్‌గా కొనసాగవచ్చు. అయితే మైదానంలో పరుగులు చేసేది మెంటార్ కాదు కాబట్టి, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యువ ఆటగాళ్లు ధోనీ బెంచ్‌మార్క్‌ను అందుకుంటూ తమకంటూ ఒక కొత్త గుర్తింపును నిర్మించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.