కొండ చిలువ జనావాసాల్లోకి వస్తే ఏం చేస్తారు..? ప్రాణభయంతో కొట్టి చంపేయాలని చూస్తారు లేదంటే పరుగులు తీస్తారు. కానీ ఈ రైతు మాత్రం ఈ రెండూ చేయలేదు. చాలా ధైర్యం ప్రదర్శించి కొండ చిలువలను బంధించారు. సమయస్ఫూర్తితో అటవీశాఖ అధికారులకు వన్యప్రాణిని అప్పగించడంతో రైతుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గ్రామంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన బోయిని నర్సింహులు అనే రైతు పశువుల కొట్టంలోకి ఓ కొండచిలువ దూరింది. రైతు నర్సింహులు ఏమాత్రం భయపడకుండా, పామును కొట్టి చంపకుండా ఎంతో ధైర్యంతో దానిని పట్టుకుని తన వద్ద ఉన్న బోనులో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హీర్యా నాయక్, సిబ్బంది.. కొండచిలువను చంపకుండా సురక్షితంగా పట్టుకున్న రైతు నర్సింహులు ధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపకుండా, గాయపరచకుండా తమకు సమాచారం అందించాలని ఎఫ్ఎస్ఓ హీర్యా నాయక్ ప్రజలకు సూచించారు.
అనంతరం అటవీ సిబ్బంది ఆ కొండచిలువను తీసుకెళ్లి మహ్మదాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సురక్షితంగా వదిలిపెట్టారు. రైతు నర్సింహులు చూపిన సమయస్ఫూర్తి, సాహసాన్ని తోటి గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.
