స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితాల్లో భారీ మార్పులు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 10 నుంచి 20 శాతం వరకు, ఢిల్లీలో 33 శాతం వరకు ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించబడ్డాయన్నారు. పాత చిరునామాలకు ఫారాలు పంపడం వల్ల నివాసాలు మార్చుకున్న ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కొత్త చిరునామాలకు మారినవారికి ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియలో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగేలా ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, ఓటర్ల జాబితాల సవరణలో పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.ప్రజాస్వామ్యానికి అవినీతి, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపం సవాలుగా మారుతున్నాయని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలంటే పూర్తి స్థాయి పారదర్శకత అవసరమని అభిప్రాయపడ్డారు.
డబ్బు, అధికారం, అవినీతి రాజకీయ వ్యవస్థలో విషవలయంగా మారాయని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. డబ్బు ద్వారా అధికారం సంపాదించడం, అధికారాన్ని ఉపయోగించుకుని మరింత డబ్బు కూడబెట్టడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను సవాలుగా మారుతున్నాయని అన్నారు.ఈవీఎంలలో సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. ఈవీఎంల పనితీరుపై పూర్తి స్థాయి పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం కేవలం రెండు శాతం వీవీప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కిస్తున్నారని, మిగిలిన 98 శాతం ఓట్లకు సంబంధించిన కాగితపు ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించడం లేదని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే అన్ని వీవీప్యాట్ స్లిప్పులనూ లెక్కించాలని అభిప్రాయపడ్డారు.ఈవీఎంలు, వీవీప్యాట్లపై అనుమానాలు తొలగించేందుకు పారదర్శక ఎన్నికల విధానం అవసరమని తెలిపారు. బ్యాలెట్ పేపర్ విధానానికి తిరిగి వెళ్లాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను కూడా ఆయన ప్రస్తావిస్తూ, ఆ డిమాండ్ సమంజసమైనదని పేర్కొన్నారు.
