హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందంటూ పోలీసులకు బెదిరింపు ఈమెయిల్ అందడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు యాంటీ సబోటేజ్ తనిఖీలు నిర్వహించారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల నిఘాను పెంచడంతో పాటు కనిపించేలా పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మరోవైపు ఈ బెదిరింపు ఈమెయిల్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. బాంబు బెదిరింపు ఈమెయిల్‌పై ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా గుర్తుతెలియని వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు. ప్రజల భద్రతకు హైదరాబాద్ పోలీసులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.
