హైదరాబాద్ లో బాంబు దాడులు చేస్తామంటూ ఉగ్రవాదులు ఈమెయిల్ పంపడం కలకలం రేపింది. 26/11 ముంబై తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్ పంపారు ఉగ్రవాదులు. ఈమేరకు లష్కరే తోయిబా పేరుతో హైదరాబాద్ పోలీసులకు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలిపారు.
కాచిగూడలోని హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్ లో బాంబ్ దాడులు చేస్తామని లేఖలో హెచ్చరించారు ఉగ్రవాదులు. ఈ బాంబు పేలుళ్లతో 300 మందిని చంపుతామంటూ బెదిరించారు ఉగ్రవాదులు. తమ నేత లతీఫ్ భట్, ఇతర సహచరుల హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు చేయనున్నామని పేర్కొన్నారు.
ఈ క్రమంలో నవంబర్ 21న హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లోని అన్ని పోలీస్ స్టేషన్లు, జోన్ల డీసీపీలకు అప్రమత్తత ఆదేశాలు జారీ చేశారు అధికారులు. హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థనా మందిరాల దగ్గర భద్రత పెంచాలని ఆదేశించారు.
సిటీలో రద్దీ ప్రాంతాల్లో నిఘా, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వదిలివెళ్లిన వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు పోలీసులు. కీలక ప్రాంతాల్లో యాంటీ సబోటేజ్ తనిఖీలు చేపట్టాలని, ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు.
