ఆరోగ్యానికి ఆలంబన.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక.. రైతన్న ఇంట సిరుల పంట.. అదే అమృతధార. మన సంస్కృతిలో పాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు మిల్క్ కొరతతో ఇబ్బంది పడిన భారతదేశం, నేడు ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశంగా టాప్లో నిలిచిందంటే దాని వెనుక ఒక మహానీయుడి అవిశ్రాంత కృషి ఉంది. ఆయనే భారత శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్. ఆయన జయంతిని పురస్కరించుకుని ఏటా నవంబర్ 26న ‘జాతీయ పాల దినోత్సవం’ జరుపుకుంటున్నాం.
‘ఆపరేషన్ ఫ్లడ్’తో అద్భుతం
1970కి ముందు దేశంలో పాల ఉత్పత్తి అంతంతమాత్రంగానే ఉండేది. పాడి రైతులు దళారుల చేతిలో మోసపోయేవారు. ఈ దుస్థితిని మార్చేందుకు డాక్టర్ వర్గీస్ కురియన్ ‘ఆపరేషన్ ఫ్లడ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్లోని ఆనంద్ కేంద్రంగా ప్రారంభమైన ‘అమూల్’ సహకార నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించారు. దీనివల్ల రైతులే స్వయంగా పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేసుకునే స్థాయికి ఎదిగారు. ఫలితంగా పాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, ప్రపంచ పాల ఉత్పత్తిలో సుమారు 24 శాతం వాటాతో భారత్ అగ్రగామిగా నిలిచింది. అందుకే కురియన్ను దేశం ‘మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కీర్తిస్తోంది.
అమృతతుల్యం.. సంపూర్ణ ఆహారం
చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ పాలు ఒక సంపూర్ణ ఆహారం. ఇందులో ఉండే కాల్షియం, విటమిన్-డి ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడితే, విటమిన్ బీ12 నాడీ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.
మహిళా సాధికారతకు బాటలు
భారతదేశంలో పాడి పరిశ్రమ కేవలం పోషకాహారానికే పరిమితం కాలేదు. కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులకు ఇది ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశువుల పెంపకంలో మహిళల పాత్ర కీలకం. వ్యవసాయం వర్షాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, పాడి పరిశ్రమ రైతు కుటుంబాలకు ఏడాది పొడవునా నిలకడైన ఆదాయాన్ని అందిస్తూ మహిళలను ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తోంది.
కల్తీపై ఉక్కుపాదం అవసరం
పాల ఉత్పత్తిలో మనం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, కల్తీ రూపంలో పొంచి ఉన్న ముప్పును అరికట్టాల్సిన అవసరం ఉంది. లాభాల కోసం కొందరు చేస్తున్న కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. నాణ్యమైన, స్వచ్ఛమైన పాలు వినియోగదారులకు అందేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో దేశీయ గోజాతులను సంరక్షించుకుంటూ, ఆధునిక పశువైద్య సేవలు, శీతలీకరణ కేంద్రాలను (కోల్డ్ స్టోరేజీ) విస్తరిస్తే పాడి రంగం మరింత లాభసాటిగా మారుతుంది. డాక్టర్ వర్గీస్ కురియన్ కలలుగన్నట్లుగా ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన పోషకాహారం అందాలి. ప్రతి పాడి రైతు ఇంట ఆనందం వెల్లివిరియాలి.
