ప్రభాస్‌ను కలిసిన కిషన్ రెడ్డి.. నషాముక్త్ భారత్ పాదయాత్రకు ఆహ్వానం

 ప్రభాస్‌ను కలిసిన కిషన్ రెడ్డి.. నషాముక్త్ భారత్ పాదయాత్రకు ఆహ్వానం

హైదరాబాద్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా సినీ ప్రముఖులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ హీరో ప్రభాస్‌ను కిషన్ రెడ్డి కలిశారు. డ్రగ్స్ నిర్మూలన కోసం నవంబర్ 25న నిర్వహించనున్న పాదయాత్రలో పాల్గొనాలని ప్రభాస్‌ను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, ప్రభాస్ కలిసి నషాముక్త్ పోస్టర్‌ను విడుదల చేశారు. డ్రగ్స్‌ మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తున్నారు.

నవంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో నషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో యువత, ప్రజలు, సినీ ప్రముఖులు భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి కోరుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కిషన్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సాయికుమార్, దర్శకుడు బోయపాటి శ్రీను, విక్టరీ వెంకటేశ్‌లను కలిసి నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.

సినీ ప్రముఖుల మద్దతుతో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు భావిస్తున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇవ్వనున్నారు.