అమ్మమ్మల కాలం నాటి వస్తువులు చూడాలనుకుంటున్నారా ? హైదరాబాద్‌లో ఈ ఇంటిని తప్పక చూడాల్సిందే!

 అమ్మమ్మల కాలం నాటి వస్తువులు చూడాలనుకుంటున్నారా ? హైదరాబాద్‌లో ఈ ఇంటిని తప్పక చూడాల్సిందే!

అది హైదరాబాద్ లోతుకుంట సరస్వతీనగర్ కాలనీ.. బయటకు చూస్తే ఓ సాధారణ ఇల్లు.. కానీ లోపల అడుగుపెడితే మాత్రం ఓ అద్భుతమైన చరిత్ర ప్రపంచం ! అమ్మమ్మల కాలం నాటి వంట సామాన్ల నుంచి పాతకాలపు గృహోపకరణాలు, సంప్రదాయ వస్తువులు, గడియారాలు, రేడియోలు, గ్రామఫోన్లు, నాణేలు, ఫర్నిచర్, అరుదైన పురాతన వస్తువుల దాకా.. వెయ్యికి పైగా అపురూప జ్ఞాపకాలకు ఈ ఇల్లు నిలయంగా మారింది. అదే ‘వైకే యాంటిక్స్ హోమ్ మ్యూజియం’. విద్యార్థులు, మహిళలు, విదేశీ పర్యాటకులను సైతం ఆకట్టుకుంటూ నిత్యం సందర్శకులతో సందడిగా ఉంటోంది.

వెయ్యికి పైగా పురాతన వస్తువులతో ‘వైకే యాంటిక్స్ హోమ్ మ్యూజియం’
ఒకప్పుడు మన ఇండ్లలో నిత్యజీవితంలో భాగమైన ఇత్తడి వస్తువులు నేడు కనుమరుగవుతున్నాయి. తాతల కాలం నాటి అరుదైన వస్తువులు, ఆనాటి జీవనశైలికి అద్దం పట్టే జ్ఞాపకాలు ఇప్పుడు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వై.కృష్ణమూర్తి తరాలు మారినా చరిత్ర చెరిగిపోకూడదనే సంకల్పంతో తన ఇంటినే పురాతన వస్తువుల ప్రదర్శనశాలగా మార్చేశారు. మన పూర్వీకులు ఎలా జీవించారు, ఎలాంటి వస్తువులు వాడారు, వంటగది నుంచి పడకగది దాకా వారి ఇండ్లలో ఏ సామగ్రి ఉండేది అనే విషయాలను ఈ వస్తువులు కండ్లకు కడుతున్నాయి. కనుమరుగవుతున్న మన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలకు ఈ హోమ్ మ్యూజియం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

అమ్మ ఇచ్చిన స్ఫూర్తి
‘మాది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం. చెన్నైలో ఐటీ ఉద్యోగం రావడంతో కుటుంబంతో అక్కడికి వెళ్తుంటే, అమ్మ ఇంట్లోని ఇత్తడి సామాన్లన్నీ ఓ బ్యాగులో సర్దింది. పాత సామాన్లు ఎందుకని అడిగితే, ఇత్తడి గిన్నెలు వంటకు మంచివని చెప్పింది. చెన్నైలో మా ఇంటికి వచ్చిన బంధుమిత్రులు ఆ గిన్నెలు బాగున్నాయని, వాటిలో వండిన వంటలు రుచిగా ఉన్నాయని మెచ్చుకున్నారు. అప్పటి నుంచే పాత వస్తువులపై ఆసక్తి పెరిగింది. అదే ఈ మ్యూజియానికి నాంది’ అని కృష్ణమూర్తి చెప్పారు. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఉద్యోగం చేస్తూనే 30 ఏండ్ల పాటు వందలాది గ్రామాలు తిరిగి, వ్యయప్రయాసలకోర్చి పురాతన వస్తువులను సేకరించి, కొని తెచ్చారు కృష్ణమూర్తి. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడల్లా ఏ పాత వస్తువునూ వదిలిపెట్టలేదు. అమ్మమ్మల కాలం నాటి వంట సామాన్లు, పాతకాలపు గృహోపకరణాలు, సంప్రదాయ వస్తువులను గత తరాల జీవన విధానాన్ని కండ్లకు కట్టేలా మ్యూజియంలో భద్రపరిచారు. పాత వస్తువులే చరిత్రకు సజీవ సాక్ష్యాలంటూ ఈ వారసత్వాన్ని ప్రజలకు ఉచితంగా పరిచయం చేస్తున్నారు. ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌లు, విద్యార్థులు, చరిత్రకారులు, సాహిత్యాభిమానులతో కూడిన బృందంతో కలిసి సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్నారు.

విజ్ఞాన భాండాగారం
చాలామందికి పాత వస్తువులంటే పనికిరానివిగా కనిపిస్తాయి. కానీ కృష్ణమూర్తికి వాటిలో చరిత్ర కనిపిస్తుంది. ‘ఒకప్పుడు మన ఇండ్లలో నిత్యజీవితంలో భాగంగా ఉన్న వస్తువులు నేటి తరానికి వింతగా కనిపిస్తున్నాయి. కాలగర్భంలో కలిసిపోతున్న పాతకాలపు వస్తువులను భావితరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతోనే ఈ మ్యూజియం ఏర్పాటు చేశా. ఎన్నో ఏండ్లుగా అరుదైన వస్తువులను సేకరించి, వాటికి ఓ ప్రత్యేక స్థానం కల్పించా. ప్రతి పురాతన వస్తువుకూ ఓ కథ ఉంటుంది. కాలాలు, సంస్కృతుల మీదుగా ప్రయాణించి వచ్చిన ఆ వస్తువుల విశేషాలను, వాటి వెనుక కథలను మా మ్యూజియం చెబుతుంది. మన సంస్కృతి, సంప్రదాయాలు, జీవనశైలికి అద్దం పడుతున్న ఈ మ్యూజియం భావితరాలకు విజ్ఞాన భాండాగారంగా నిలుస్తుంది’ అని కృష్ణమూర్తి అన్నారు.

చిన్ననాటి జ్ఞాపకాలకు మళ్లీ జీవం
ఇక్కడ ఒక్కో వస్తువును చూడగానే కొందరికి చిన్ననాటి రోజులు, మరికొందరికి అమ్మమ్మ ఇంటి జ్ఞాపకాలు కండ్ల ముందు కదలాడుతాయి. అప్పటి వంటల రుచి, వంటింటి సందడి, ఇంటిల్లిపాదీ కలిసి గడిపిన క్షణాలు మళ్లీ మనసులో మెదులుతాయి. పాతకాలపు రోకళ్లు, తిరగళ్లు, రాగి, ఇత్తడి పాత్రలు చూసి మహిళలు ఆశ్చర్యపోతూ వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మలను గుర్తుచేసుకుంటున్నారు. మన పెద్దలు ఎలా జీవించారు, వంటింట్లో ఏ సామగ్రి వాడారు, సంప్రదాయాలకు ఎంత ప్రాధాన్యం ఉండేది అనే విషయాలను ఆధునిక టెక్నాలజీకి అలవాటుపడిన నేటి యువత ఈ వస్తువుల ద్వారా తెలుసుకుంటున్నారు. చరిత్రను పుస్తకాల్లో చదవడం ఒక అనుభవమైతే, ఆ కాలం నాటి వస్తువులను కండ్లారా చూడటం మరో అనుభూతి. కాలం మారుతున్న కొద్దీ ఎన్నో వస్తువులు కనుమరుగవుతున్నాయి. వాటితోపాటే ఆనాటి జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలు మరుగున పడుతున్నాయి. పాత వస్తువులను సేకరించడమే కాదు, వాటి వెనుక చరిత్రను భావితరాలకు అందించాలన్నదే కృష్ణమూర్తి సంకల్పం. అందుకే గతానికి, వర్తమానానికి వారధిగా నిలుస్తున్న ఈ హోమ్ మ్యూజియం.. కాలం గడిచినా చెరిగిపోని జ్ఞాపకాల నిధి!

ఈ మ్యూజియం చూడాలంటే..
పేరు: వైకే యాంటిక్స్ హోమ్ మ్యూజియం
అడ్రస్ : సరస్వతీనగర్ కాలనీ, లోతుకుంట, హైదరాబాద్ 
ప్రవేశం: ఉచితం