నితీష్ సేతుపై రాజకీయ దుమారం.. పోస్టర్లు చించివేసిన ఆర్జేడీ కార్యకర్తలు

నితీష్ సేతుపై రాజకీయ దుమారం.. పోస్టర్లు చించివేసిన ఆర్జేడీ కార్యకర్తలు

బీహార్ రాజకీయాల్లో మరో వివాదం రాజుకుంది. వైశాలి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన నితీష్ సేతు వంతెనపై ఆర్‌జేడీ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. ప్రారంభోత్సవం జరిగిన కొద్ది గంటల్లోనే వంతెనపైకి చేరుకున్న వందలాది మంది కార్యకర్తలు ఎన్డీయే ఏర్పాటు చేసిన పోస్టర్లు, బ్యానర్లను చించివేశారు. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌లకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆర్‌జేడీ జెండాలతో మోటార్ సైకిళ్లపై వచ్చిన కార్యకర్తలు సుమారు 40 నిమిషాల పాటు వంతెనపై హంగామా సృష్టించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ నిరసనకారులను నిలువరించలేకపోయారు. ఈ ఘటన బీజేపీ, ఆర్‌జేడీ మధ్య రాజకీయ విమర్శలకు దారితీసింది.

బీజేపీ, ఆర్‌జేడీ మధ్య మాటల యుద్ధం

వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన నిరసనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. అభివృద్ధి పనులను స్వాగతించాల్సింది పోయి ఆర్‌జేడీ రాజకీయ నాటకాలకు తెరలేపిందని బీజేపీ ప్రతినిధి నీరజ్ కుమార్ శర్మ విమర్శించారు. ప్రజలు వంతెనలు, అభివృద్ధిని కోరుకుంటున్నారని, పోస్టర్లు చింపివేసే రాజకీయాలను కాదని తేజస్వి యాదవ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆర్‌జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ నిరసనను సమర్థించారు. ఈ వంతెన ఇప్పటికే ప్రారంభమైందని, కేవలం పేరు మార్చడం కోసమే కోట్ల రూపాయల ప్రజాధనంతో మరోసారి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారని ఆరోపించారు. కార్యకర్తలు చేపట్టింది నిరసన మాత్రమేనని, మోసపూరితంగా బ్యానర్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తేజస్వి యాదవ్ విజన్ వల్లే ఈ వంతెన నిర్మాణం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.


ఈ ప్రాజెక్టుకు 'నితీష్ సేతు' అని పేరు పెట్టడంపై మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వంతెనకు పదో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ పేరు పెట్టాలని తాను గతంలోనే అసెంబ్లీలో ప్రతిపాదించినట్లు గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చిందని విమర్శించారు.ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తేజస్వి ఆరోపించారు. నితీష్ కుమార్ రాజకీయ వారసత్వాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఈ పేరు పెట్టారని వ్యాఖ్యానించారు.

వంతెన పేరు వివాదం బీహార్‌ను దాటి పంజాబ్‌కు కూడా చేరింది. గురు గోవింద్ సింగ్ పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీహార్ ప్రభుత్వం సిక్కుల మనోభావాలను దెబ్బతీస్తోందని పంజాబ్ మంత్రి హర్పాల్ సింగ్ చీమా విమర్శించారు.నితీష్ కుమార్‌ను గౌరవించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని, అయితే గురు గోవింద్ సింగ్ పేరును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

రూ.4,280 కోట్లతో నిర్మాణం

కచ్చి దర్గా - బిదుపూర్ ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ వంతెనను నిర్మించారు. సుమారు రూ.4,280 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పొడవు 9.76 కిలోమీటర్లు. ఉత్తర, దక్షిణ బీహార్ మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు మహాత్మా గాంధీ సేతుపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

నవంబర్ 21న ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. అయితే ప్రారంభోత్సవం అనంతరం అభివృద్ధి ప్రాజెక్టుగా వార్తల్లో నిలవాల్సిన ఈ వంతెన, ఇప్పుడు పేరు వివాదం, రాజకీయ నిరసనలతో బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.