పెద్దపల్లి: ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50వ స్వర్ణోత్సవ మహాసభ పెద్దపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ, అనంతరం ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సంఘం నాయకులు, సభ్యులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంఘానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నియంతృత్వ ధోరణులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ప్రజల మధ్య కులాల పేరుతో విభేదాలు సృష్టిస్తూ దళితులను అణగదొక్కే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టాలని, దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఇచ్చిన 'బోధించు, సమీకరించు, పోరాడు' నినాదంతో ముందుకు సాగాలని కోరారు.
విద్య, నిధుల కేటాయింపుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద దళిత విద్యార్థుల అభ్యున్నతి కోసం కాకా వెంకటస్వామి అంబేద్కర్ కళాశాలలు స్థాపించారని, వాటి ద్వారా ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. దళిత సమాజ అభివృద్ధికి నిరంతరం అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
