కులం లేదు.. మతం లేదు.. అంతా ఒక్కటే..! గురునానక్ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప మెసేజ్ ఇదే!

కులం లేదు.. మతం లేదు.. అంతా ఒక్కటే..! గురునానక్ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప మెసేజ్ ఇదే!

సమానత్వం, స్వేచ్ఛ, మానవ విలువల పునాదిగా పుట్టిన భారతీయ మతాల్లో బౌద్ధం ప్రధానమైనది. ఆ తర్వాత ఇదే విలువలకు దగ్గరగా సిక్కు మతం పుట్టింది. ఈ రెండూ భారతదేశంలోనే పుట్టిన మతాలు. సమానత్వం, సామాజిక ఐక్యత, పరస్పర గౌరవం కోసం సిక్కు మతం కృషి చేసింది. ఆ మత స్థాపకులు గురునానక్ దేవ్. ఏటా కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుపుకుంటారు. హిందూ, ఇస్లాం మత గ్రంథాలను అధ్యయనం చేసిన ఆయన, అన్ని మతాల సామరస్యాన్ని, ఏకేశ్వరవాదాన్ని బోధించారు. కుల వ్యవస్థను, మతపరమైన వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఏక్ ఓంకార్’ (దేవుడు ఒక్కడే) సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఆయన బోధనలే తర్వాత సిక్కుల పవిత్ర గ్రంథం ‘గురు గ్రంథ్ సాహిబ్’కు ప్రేరణ అయ్యాయి.

అందరూ ఒక్కటే.. అందరూ సమానులే!
గురునానక్ సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. దేవుడి ముందు అందరూ సమానులే అనేది ఆయన బోధనల సారం. కుల, మత భేదం లేకుండా అందరికీ ఉచితంగా భోజనం పెట్టే సామూహిక వంటశాల ‘లంగర్’ను, అందరూ ఒకే వరుసలో నేలపై కూర్చుని కలిసి తినే ‘పంగత్’ను ఆయన ప్రవేశపెట్టారు. ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా అందరూ ఒకే స్థాయిలో కూర్చుని భోజనం చేయడం కుల భేదాలను చెరిపేసి, సమాజంలో సోదరభావాన్ని బలపరిచింది.

గురునానక్, రవిదాస్ బోధనలు
అణచివేతకు గురైన వర్గాల విముక్తిని గురునానక్ ప్రత్యేకంగా కోరుకున్నారు. ఆయన బోధనలతో ప్రభావితమైన ఎంతోమంది దళితులు సిక్కు మతంలో చేరి గౌరవం, సమానత్వం పొందారు. ఐదో సిక్కు గురువు గురు అర్జున్ దేవ్ అమృత్‌‌సర్‌‌లోని దర్బార్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం)కు నాలుగు వైపులా తలుపులు పెట్టించారు. నాలుగు దిక్కుల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ స్వాగతం అనే సందేశం అది; కుల, మత, జాతి భేదం లేకుండా అందరికీ ఆ ఆధ్యాత్మిక స్థలంలో సమాన హక్కు ఉందని ఆయన చాటారు. సిక్కుల పవిత్ర గ్రంథం ఆది గ్రంథ్‌‌లో సంత్ రవిదాస్ వంటి దళిత కవుల రచనలకు చోటు కల్పించారు.

సామాజిక న్యాయ పోరాటానికి..
దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, మానవ విలువల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. అందుకు గురునానక్ సామాజిక ఐక్యతా తత్వం, ఆయన సామాజిక చైతన్య స్ఫూర్తి దారి చూపుతాయి. భారత రాజ్యాంగం మెజార్టీ ప్రజల హక్కులకు ప్రాధాన్యం ఇచ్చినా, పాలన, విధానాలు అందుకు విరుద్ధంగా సాగుతుండటంతో పీడిత వర్గాల హక్కులు, అవకాశాలకు నష్టం జరుగుతోంది. నేటి సామాజిక న్యాయ పోరాటానికి గురునానక్ విలువలు, రాజ్యాంగ సూత్రాలే ఆయుధాలు కావాలి.