లగ్జరీ కార్ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేర్లలో బీఎండబ్ల్యూ (BMW) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ కార్లకు మంచి పేరు, గుర్తింపు ఉంది. ముఖ్యంగా లగ్జరీ కార్లు కొనాలనుకునే వారు.. చాలామంది బీఎండబ్ల్యూ కార్లనే ఇష్టపడుతుంటారు. ఈ కంపెనీ లోగోను కూడా చాలామంది చూసే ఉంటారు. కానీ BMW అనే మూడు అక్షరాలకు అసలు అర్థం ఏంటో మీకు తెలుసా ? ఈ పేరు ఎలా వచ్చింది ? ఈ కంపెనీ మొదట కార్లను తయారు చేసేదా ? లేక మరేదైనా ఉత్పత్తి చేసేదా ? ఇలాంటి విషయాలు చాలామందికి తెలియవు.
నిజానికి BMW మొదట్లో కార్ల తయారీ సంస్థగా ప్రారంభం కాలేదు. విమానాల ఇంజిన్ల తయారీతో కంపెనీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత బైక్స్, కార్ల తయారీ రంగాల్లోకి అడుగుపెట్టి ప్రపంచంలోనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. మరి BMW పూర్తి పేరు ఏమిటి ? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం....
BMW అంటే ఏంటి ?
BMW అనేది జర్మన్ భాషలోని మూడు పదాల మొదటి అక్షరాలతో ఏర్పడిన పేరు. దీని పూర్తి పేరు Bayerische Motoren Werke. దీనిని ఇంగ్లీష్ లో Bavarian Motor Works అని అంటారు. తెలుగులో చెప్పాలంటే 'బవేరియా మోటార్ పరిశ్రమలు' లేదా 'బవేరియా మోటార్ వర్క్స్' అని అర్థం. ఇందులోని ప్రతి పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది.
Bayerische (బేయరిషే): జర్మనీలోని బవేరియా అనే ప్రాంతాన్ని సూచిస్తుంది.
Motoren (మోటోరెన్): ఇంజిన్లు లేదా మోటార్లు అని అర్థం.
Werke (వెర్కే): పరిశ్రమలు లేదా తయారీ కేంద్రాలు అని అర్థం.
ఈ మూడు పదాలను కలిపితే బవేరియా ప్రాంతంలో ఇంజిన్లు, మోటార్లు తయారు చేసే సంస్థ అని అర్థం వస్తుంది. ఈ పేరును బట్టి చూస్తే BMW సంస్థకు మొదటి నుంచీ ఇంజిన్ల తయారీతో ఎంతటి అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు.
1916లోనే BMW ప్రయాణం ప్రారంభం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ కార్లకు పేరుగాంచిన BMW సంస్థ 1916లో జర్మనీలో ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే మొదట్లో ఈ కంపెనీ కార్ల తయారీపై దృష్టి పెట్టలేదు. విమానాల కోసం ఇంజిన్లను తయారు చేసేది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా విమాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. విమానాల పర్ఫార్మెన్స్ మెరుగుపడాలంటే శక్తివంతమైన, నమ్మకమైన ఇంజిన్లు అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన BMW విమాన ఇంజిన్ల తయారీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంటే ఇప్పుడు మనం రోడ్లపై చూస్తున్న BMW లగ్జరీ కార్లకు సంబంధించిన సంస్థ ఒకప్పుడు విమానాలకు ఇంజిన్లు తయారు చేసేదన్నమాట.
విమాన ఇంజిన్ల నుంచి కార్ల తయారీ వరకు..
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జర్మనీలో పరిస్థితులు మారిపోయాయి. యుద్ధం తర్వాత విధించిన ఆంక్షలు, విమాన ఇంజిన్ల తయారీపై వచ్చిన పరిమితుల కారణంగా BMW వ్యాపార విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ సంస్థ విమాన ఇంజిన్ల తయారీతో పాటు ఇతర రంగాలపై దృష్టి పెట్టింది. మొదట బైక్స్ తయారీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కార్ల తయారీ రంగంలోకి ప్రవేశించింది.
ఇలా ఒక్కో అడుగు వేస్తూ BMW ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆటోమొబైల్ బ్రాండ్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ లగ్జరీ కార్లు, బైక్స్, ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారు చేస్తోంది.
పేరు మాత్రం మార్చుకోలేదు.. కారణం ఇదే!
BMW కంపెనీ వ్యాపారాన్ని విమాన ఇంజిన్ల తయారీ నుంచి బైక్స్, కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల వరకు విస్తరించిన.. దాని అసలు పేరును మాత్రం మార్చుకోలేదు. దీనికి కారణం ఆ సంస్థకు మొదటి నుంచీ ఉన్న ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్, మోటార్ తయారీ వారసత్వం. BMW పేరు ఇప్పటికీ దాని పాత చరిత్రను గుర్తు చేస్తుంది.
మొత్తానికి, BMW అంటే కేవలం కాస్ట్లీ కార్ల బ్రాండ్ మాత్రమే కాదు. దాదాపు ఒక శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన జర్మన్ సంస్థ. విమాన ఇంజిన్ల తయారీతో మొదలైన ఈ కంపెనీ ప్రయాణం నేడు ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే స్థాయికి చేరుకుంది.
