మళ్లీ అధికారంలోకి రావడమే  లక్ష్యం.. అధిష్టానం ఆదేశాలను వంద శాతం పాటిస్తా : సీఎం రేవంత్

మళ్లీ అధికారంలోకి రావడమే  లక్ష్యం.. అధిష్టానం ఆదేశాలను వంద శాతం పాటిస్తా : సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ సందీప్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో  సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం ఇచ్చే ఆదేశాలను వందశాతం పాటిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కోసం మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీలో నాయకులు వ్యవహరించాల్సిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి విషయాలను మైక్‌లో చెప్పాలి.. చెడు విషయాలను చెవిలో చెప్పాలి అని సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలని, అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించకుండా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.గత ప్రభుత్వాల హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని సీఎం తెలిపారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

నీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం 2022లో కేసీఆర్, జగన్ ప్రభుత్వాల హయాంలోనే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. రూ.1,580 కోట్లకు సంబంధించి జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 2022లోనే జీవో జారీ చేసిందన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో టీఆర్ఎస్ భాగస్వామిగా ఉన్న సమయంలోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ జరిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2023 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని, ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన చర్యలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు.