ఒకప్పుడు కామెడీ అంటే కేవలం సినిమాలు, టీవీ షోలు మాత్రమే గుర్తుకొచ్చేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో వినోదం కొత్త పుంతలు తొక్కుతోంది. చేతిలో ఒక మైక్, ఎదురుగా ప్రేక్షకులు, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే పంచులతో ‘స్టాండప్ కామెడీ’ నగరవాసులను కడుపుబ్బా నవ్విస్తోంది. నిత్యం ఉరుకులు పరుగులతో కూడిన ఐటీ, కార్పొరేట్ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నగరవాసులు ఇప్పుడు కామెడీ క్లబ్‌ల బాట పడుతున్నారు. ముఖ్యంగా నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు నగరంలో వరుస కామెడీ షోలు సందడి చేయనున్నాయి.
కేఫ్‌ల నుంచి క్లబ్‌ల వరకు నవ్వుల జల్లులు
హైదరాబాద్‌లో స్టాండప్ కామెడీకి ఆదరణ అనూహ్యంగా పెరిగింది. పెద్ద ఆడిటోరియాలే కాకుండా చిన్న కేఫ్‌లు, రెస్టారెంట్లు, ప్రత్యేక కామెడీ క్లబ్‌లు సైతం నవ్వుల వేదికలుగా మారుతున్నాయి. స్థానిక యువత తమ హాస్య ప్రతిభకు పదును పెడుతూ ఓపెన్ మైక్ షోల ద్వారా కమెడియన్లుగా ఎదుగుతున్నారు. గచ్చిబౌలిలోని ఇక్కడి ‘ది కామెడీ థియేటర్’ ఐటీ ఉద్యోగులకు అడ్డాగా మారింది. ఇక్కడ ప్రతిరోజూ హిందీలో గంటన్నర పాటు స్టాండప్ షోలు జరుగుతుంటాయని, సందర్భాన్ని బట్టి ఇతర రాష్ట్రాల ప్రముఖ కమెడియన్లతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని కమెడియన్లు సయ్యద్ రెహాన్, ఇర్ఫాన్ తెలిపారు.
మాదాపూర్ & ఫిలింనగర్: మాదాపూర్‌లోని ‘ది స్ట్రీట్ కామెడీ థియేటర్’ కొత్త కమెడియన్లకు, తెలుగు స్టాండప్ షోలకు వేదికైంది. అలాగే ఫిలింనగర్‌లోని ‘ఆరోమలీ’ వేదికగా ఇటీవల ముహమ్మద్ సుహేల్, పునీత్ పానియా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వీరితో పాటు రజత్ చౌహాన్, మంజిత్ ఠాకూర్, అశ్విన్ సింగ్, దేవిష్ దీక్షిత్ వంటి కమెడియన్లు నగరవాసులను అలరిస్తున్నారు.
మన సమస్యలే జోకులు!
ఉద్యోగ కష్టాల నుంచి కుటుంబ సమస్యల వరకు, ప్రేమ వ్యవహారాల నుంచి సోషల్ మీడియా ట్రెండ్స్, రాజకీయ వ్యంగ్యం వరకు.. నిత్య జీవితంలోని సాధారణ సంఘటనలనే కమెడియన్లు హాస్యంగా మలుస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ షోలు జరుగుతున్నప్పటికీ, ఇటీవల తెలంగాణ యాస, హైదరాబాదీ స్లాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వీకెండ్స్‌లో స్నేహితులు, యువత ‘బుక్ మై షో’ ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని మరీ ఈ షోలకు క్యూ కడుతున్నారు.
వేడుకల్లోనూ నవ్వుల సందడి
కేవలం స్టాండప్ కామెడీయే కాకుండా తెలుగులో మిమిక్రీ, వెంట్రిలాక్విజం, ‘హాస్యవల్లరి లైవ్’ వంటి కార్యక్రమాలకు కూడా ఆదరణ పెరుగుతోందని ప్రముఖ మిమిక్రీ కళాకారుడు మల్లం రమేష్ పేర్కొన్నారు. క్లబ్‌లకే పరిమితం కాకుండా ఇప్పుడు వివాహాలు, బర్త్ డే పార్టీలు, ఫ్యామిలీ గెట్-టు-గెదర్లలోనూ ప్రత్యేకంగా కామెడీ ప్రదర్శనలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన వివరించారు. చిన్న చిన్న జీవిత సమస్యలనే పెద్ద నవ్వులుగా మారుస్తూ యువ కమెడియన్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. యాంత్రిక జీవనంలో కాసేపు మనస్ఫూర్తిగా నవ్వుకునేందుకు ఈ కామెడీ క్లబ్‌లు భాగ్యనగరవాసులకు చక్కటి వేదికలుగా నిలుస్తున్నాయి.
