నిజమైన హిందువుగా మిమ్మల్ని మార్చడం నా కర్తవ్యం.. RSS, బీజేపీకి రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

నిజమైన హిందువుగా మిమ్మల్ని మార్చడం నా కర్తవ్యం.. RSS, బీజేపీకి రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

న్యూఢిల్లీ: బీజేపీ, ఆర్ఎస్ఎస్‎లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. భారతీయ ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయాల గురించి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఏమాత్రం అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. వారిని అసభ్యకరమైన, అత్యాశపరులైన, కులతత్వ పురుషాహంకారులుగా రాహుల్ అభివర్ణించారు.

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ సభలో తన తల్లిదండ్రులు సోనియా, రాజీవ్ గాంధీల అనుబంధం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చిన్నతనంలో తమ ఇంట్లో భోజన సమయంలో మా అమ్మ నాన్న ఒడిలో కూర్చునేవారని.. ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుందని తాను అనుకునేవాడినని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. 

ఈ క్రమంలో బీజేపీ విమర్శలపై ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. మహారాష్ట్రలోని ఎలిఫెంటా గుహలలో ఉన్న శివపార్వతుల సమైక్య రూపమైన అర్ధనారీశ్వర శిల్పం ఫోటోను షేర్ చేసి.. భారత ఆధ్యాత్మిక సంప్రదాయాల లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఈ విషయం మరింత స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాలపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అస్సలు అవగాహన లేదని విమర్శించారు. 

భయం, కోపం, ద్వేషం అనేవి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారుల హృదయాల్లో ఒక వల మాదిరిగా ఏర్పడి ప్రేమను వ్యక్తపరచకుండా నిరోధిస్తున్నాయని అన్నారు. ఒక నిజమైన హిందువుగా వారిని ఈ వల నుంచి విడిపించడం నా కర్తవ్యం. తద్వారా వారు కూడా తమ జీవితాలలో ప్రేమ, అనుబంధం, అద్భుతమైన సౌందర్యాన్ని, ఆనందాన్ని అనుభవించడం ప్రారంభించగలరని సెటైరికల్ కామెంట్ చేశారు.