ఒకప్పుడు చేతులు మారిన అణాలు, పైసలు.. రాజుల పాలనకు, ఆనాటి ఆర్థిక వ్యవస్థకు ఆనవాళ్లుగా నిలిచిన అరుదైన నాణేలు.. ఇప్పుడు చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఒక్కో నాణెం ఒక్కో కాలాన్ని, ఒక్కో రాజ్యాన్ని కండ్ల ముందుంచుతుంది. అలాంటి నాణేలు, పాత కరెన్సీ నోట్లు, స్టాంపుల ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తెస్తోంది ‘హైపెక్స్–2026’. ఈ నెల 20 నుంచి 22 వరకు సిటీలోని రెడ్‌హిల్స్‌లో ఈ ప్రదర్శన జరగనుంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పాట్నా, లక్నో, జైపూర్, తిరువనంతపురం నుంచి సేకర్తలు తమ సేకరణలతో వస్తున్నారని హైదరాబాద్ ఫిలటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ అధ్యక్షుడు సాగి శ్రీనివాసరాజు చెప్పారు. 35 కిలోల పురాతన తాళం కప్ప ఈసారి ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు.
రాజుల కాలం నుంచి నిజాం దాకా
చోళుల కాలం నాటి రాగి నాణేలు, బాబర్, అక్బర్, షాజహాన్ కాలం నాటి వెండి నాణేలు అప్పటి పాలనకు, వాణిజ్యానికి అద్దం పడతాయి. నిజాం కాలం నాటి హైదరాబాద్ కరెన్సీ ‘ఉస్మానియా సిక్కా’ మన సిటీ చరిత్రకు సాక్ష్యం. బ్రిటిష్ కాలం నాటి నోట్లు, స్వాతంత్రం తర్వాత 1960ల నాటి వంద రూపాయల నోట్లు, నెమలి, లేడి, బోటు బొమ్మలతో వచ్చిన పాత నోట్లు కాలంతో పాటు కరెన్సీ ఎలా మారిందో చెబుతాయి. 1982 ఏషియన్ గేమ్స్, సైన్స్ కాంగ్రెస్, బాలగంగాధర తిలక్ పేరిట వచ్చిన స్మారక నాణేలు ఆయా ఘట్టాలను గుర్తుచేస్తాయి. ఇలాంటి అరుదైన, తక్కువగా ముద్రించిన నాణేలకు సేకర్తల్లో రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా విలువ ఉందని, ఎన్టీఆర్ బొమ్మతో హైదరాబాద్ మింట్ ముద్రించిన రూ.100 వెండి నాణేనికి కూడా మంచి డిమాండ్ ఉందని సేకర్తలు చెబుతున్నారు.
64 ఏండ్ల సొసైటీ
పాత నాణేలు, స్టాంపుల సేకరణను హాబీగా చేసుకున్నవాళ్లతో 1962లో హైదరాబాద్ ఫిలటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ ఏర్పాటైంది. ఇందులో 450 మంది సభ్యులు ఉన్నారు; ఏటా ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. వృత్తిరీత్యా బిల్డర్ అయిన తనకు చిన్ననాటి నుంచే పాత నాణేలు, స్టాంపుల సేకరణ హాబీ అని శ్రీనివాసరాజు చెప్పారు. సేకర్తలు ప్రతి నెలా రెండో ఆదివారం ఆబిడ్స్‌లోని యూనిటీ హౌస్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కలుస్తుంటారు. భావితరాలకు చరిత్రను చూపించేందుకే ఈ నాణేలను భద్రపరుస్తున్నామని సేకర్తలు అంటున్నారు.
జర జాగ్రత్త
పాత నాణేలు, నోట్లు కొంటామంటూ సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారని, రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, వారి బారిన పడొద్దని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన సేకర్త జీ గంగాధర్ హెచ్చరించారు.
