జయశంకర్ భూపాలపల్లి జిల్లా: త్వరలో రామగిరి ఖిల్లా రూపురేఖలు మారనున్నాయని, దానిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పార్లమెంటులో పోరాడి తాడిచర్ల మైన్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించామన్నారు. పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నానని ఎంపీ వంశీకృష్ణ వెల్లడించారు.
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మంథని, కాటారం, మహదేవపూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలు, విద్యార్థులతో మమేకమయ్యారు.
మహదేవపూర్‌లో అయ్యప్ప స్వాములతో కలిసి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బిక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాటారం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాల, కళాశాలను సందర్శించారు. విద్యాసంస్థలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నిరంకుశ, నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. బీజేపీ నేతలు విభజించు పాలించు అనే కుట్రపూరిత విధానాలను అనుసరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేస్తేనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, పరస్పరం గొడవలు పడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. మన హక్కులను మనం గౌరవించుకోవాలని సూచించారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు. కేటీఆర్ ఆస్తులు పెంచుకుంటూ కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారని, కేసీఆర్ తన ఫామ్‌హౌస్ కోసం ప్రత్యేకంగా చెరువు తవ్వించి నీటిని వినియోగించుకున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని మండిపడ్డారు.ప్రస్తుత ప్రభుత్వం మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో TOMCOM ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.
