టెక్నాలజీ వాడకంలో TGSRTC సంస్థ ఎప్పుడు ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెటింగ్ మొదలుకొని హైదరాబాద్ మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ దాకా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది ఆర్టీసీ. ఈ క్రమంలో ప్రయాణికులు, సిబ్బంది రక్షణే ధ్యేయంగా i-Alert వ్యవస్థను ప్రవేశపెట్టింది టిజిఎస్ఆర్టీసీ. టెక్నాలజీని అప్డేట్ చేసుకొంటూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే సంస్థ ధ్యేయమని తెలిపారు ఎండీ అనిల్ కుమార్.
ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సురక్షిత డ్రైవింగ్, డీజిల్ పొదుపు పద్ధతులను ప్రోత్సహించడానికి టీజీఎస్ ఆర్టీసీ బిఎస్ -6 బస్సులలో i-ALERT వ్యవస్థను ప్రవేశపెట్టి దేశంలోనే తొలి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రికార్డు సృష్టించి అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు.
ఈ టెక్నాలజీ సమర్థవంతమైన వినియోగించడం ద్వారా సంస్థ ఇప్పటివరకు సుమారు రూ. 36 కోట్ల విలువైన HSD (హై-స్పీడ్ డీజిల్) ఆయిల్‌ను ఆదా చేయగా, ప్రతి నెలా అంచనా ప్రకారం సుమారు రూ. 2 కోట్లు ఆదా అవుతోందని తెలిపారు. దీనివల్ల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గడంతో పాటు బస్సుల మొత్తం ఇంధన సామర్థ్యం మెరుగుపడిందని అన్నారు.
డ్రైవింగ్ పర్యవేక్షణ, పనితీరు మెరుగు పరచడం...
i-ALERT వ్యవస్థ డ్రైవింగ్ విధానాలను నిరంతరం గమనిస్తూ డ్రైవర్ల పనితీరును అంచనా వేయడానికి తోడ్పడుతుందని...
ముఖ్యంగా సరైన గేర్ ఎంపిక, వినియోగం, నిర్దేశించిన Green Band RPM పరిధిలో డ్రైవింగ్ చేయడం, ఎకానమీ గేర్లను సమర్థవంతంగా వాడటం, అనవసర ఖాళీగా ఇంజిన్ నడవడం తగ్గించవచ్చని అన్నారు ఎండీ అనిల్ కుమార్. అదేవిధంగా ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యంగా బ్రేక్ ల వాడకం, ఇంధన పొదుపు డ్రైవింగ్ పద్ధతులను అలవర్చుకోవడం వంటి అంశాలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది.
i-ALERT పనితీరు నివేదికల ఆధారంగా ఒక్కొక్క డ్రైవర్ పనితీరును పరిశీలిస్తూ, క్రమం తప్పకుండా సమాచారం ఇస్తుందని అన్నారు. విధి నిర్వహణ అనంతరం డ్రైవర్ నైపుణ్యాన్ని అంచనావేసి డ్రైవర్ పనితీరుకు గ్రేడింగ్స్ కూడా ఇస్తుందని తెలిపారు. అదేవిధంగా మార్గదర్శకాలు అందించడం ద్వారా శాస్త్రీయ, ఇంధన పొదుపు డ్రైవింగ్ పద్ధతులను అనుసరించేలా డ్రైవర్లను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
1500 అశోక్ లేలాండ్. BS-VI బస్సులలో i-ALERT పరికరాలను అమర్చడం ద్వారా రోజుకు 6వేల 603 లీటర్లు, నెలకు లక్షా 98వేల 090 లీటర్ల HSD ఆయిల్ ఆదా అవుతోందని తెలిపారు. ప్రతి లీటరు HSD ఆయిల్‌కు కార్బన్ ఉద్గారం సుమారు 2.56 కిలోలుగా అంచనా వేయగా, దీని ప్రకారం రోజుకు 16వేల 904 కిలోలు, నెలకు 507.11 మెట్రిక్ టన్నులు, సంవత్సరానికి 6,169.84 మెట్రిక్ టన్నుల CO_2 వ్యర్థాలు తగ్గుతున్నాయని అన్నారు.
