కార్తీకమాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనప్పటికి కార్తీక పౌర్ణమి రోజుకు ( 2026 నవంబర్ 24) చాలా పవిత్రమైనది. ఆ రోజును శివకేశవులను ఆరాధించేందుకు ఎంతో అనుకూలమైన రోజు. ఇంట్లో దీపారాధన.. శివాలయంలో 365 వత్తులు వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. కొంతమంది దీపదానం చేయడం వలన మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ( 2026) కార్తీక పౌర్ణమి ఎప్పడు.. ఏ సమయంలో దీపారాధన చేయాలి.. 365 వత్తులు వెలిగించేందుకు శుభముహూర్తం ఎప్పుడు.. ఇంకా ఆ రోజు ఎలాంటి పనులు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. .!
కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి. ఇంట్లో దీపాలు వెలిగించడం నుంచి పవిత్ర స్నానాలు, ఆలయ దర్శనాలు, అన్నదానాలు చేయడం వరకు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రోజున చేసే దీపదానం వల్ల పుణ్యఫలం లభిస్తుందని, దానధర్మాలతో జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఆ రోజున చేసే పూజ, దానం, దీపదానంకు 10 యజ్ఞాలు చేసినంత ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.
కార్తీక పౌర్ణమి 2026 తిథి, పూజా సమయాలు
- పౌర్ణమి తిథి ప్రారంభం : నవంబర్ 23 రాత్రి 11:42 గంటలకు
- పౌర్ణమి తిథి ముగింపు: నవంబర్ 24 రాత్రి 8:23 గంటల వరకు
- పౌర్ణమి బ్రహ్మముహూర్తం : నవంబర్ 24 ఉదయం 5:03 నుంచి 5:57 గంటల వరకు
- పౌర్ణమి రోజు చంద్రోదయం: సాయంత్రం 5:01 గంటలకు
వత్తులు వెలిగించేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి వెలిగించండి. దక్షిణం వైపు వెలిగించకూడదు.వెలిగించేటప్పుడు "ఓం నమః శివాయ" లేదా "ఓం నమో నారాయణాయ" అని 108 సార్లు జపం చేయాలి. ఆవు నెయ్యితో వెలిగిస్తే - లక్ష్మీ కటాక్షం...నువ్వుల నూనెతో వెలిగిస్తే - శని దోష నివారణ... కొబ్బరి నూనెతో వెలిగిస్తే - ఆరోగ్యం, శాంతి కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.
కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు
పవిత్ర స్నానం, సూర్యారాధన: కార్తీక పౌర్ణమి ( నవంబర్ 24) ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. అవకాశం ఉంటే నదీస్నానం చేయాలి. లేదంటే ఇంట్లోనే ఆభావనతో చేయాలని పండితులు చెబుతున్నారు.
స్నానం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి ।
నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు
ఈ మంత్రం చదువుతూ చన్నీళ్లను స్నానం చేయాలి. అయితే సబ్బు ఉపయోగించకూడదు.
ఇంట్లోనే స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. రాగి పాత్రలో నీటిని తీసుకుని ఎర్రటి పూలు, అక్షతలు కలిపి సూర్యుడికి సమర్పిస్తూ 'ఓం సూర్యాయ నమః' అని జపించాలి.
లక్ష్మీనారాయణులకు ప్రత్యేక పూజ: కార్తీక పౌర్ణమి రోజున గణపతి పూజతో పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి. అనంతరం మహావిష్ణువుకు తులసి దళాలు, పండ్లు సమర్పించి, లక్ష్మీదేవికి పుష్పాలతో పూజ చేయాలి. ఇలా చేయడం వలన కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం, పరస్పర ప్రేమ, ప్రశాంతత కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
శివలింగానికి అభిషేకం: అదేరోజు త్రిపురారి పౌర్ణమి కావడంతో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. సమీపంలోని శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేయాలి. రుద్రాబిషేకం తరువాత స్వామివారిని అలంకరించి బిల్వపత్రాలు సమర్పిస్తూ 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించాలి.
అన్నదానం: కార్తీకపౌర్ణమి రోజు పేదలకు అన్నదానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పేదలకు భోజనం పెట్టడం, బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు అందించడం మంచిది. చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన వారికి దుస్తులు, దుప్పట్లు ఇవ్వడం వలన కష్టాలు తొలగుతాయి.
సాయంత్రం దీపదానం, గోసేవ: సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర .. తులసి కోట దగ్గన.. పూజా మందిరంలో దీపాలు వెలిగించాలి. నువ్వులనూనె లేదా ఆవు నేతితో దీపారాధన చేయాలి. అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారు. గోవులకు పచ్చిగడ్డిని ఇవ్వాలి. అనంతరం గోపూజ చేయాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
