బ్రెజా కారు కోసం పెళ్లి రద్దు చేసిన పోలీస్.. పీటలపైనే ఆగిన పెళ్లి.. కన్నీటిపర్యంతమైన వధువు .!

బ్రెజా కారు కోసం పెళ్లి రద్దు చేసిన పోలీస్.. పీటలపైనే ఆగిన పెళ్లి..  కన్నీటిపర్యంతమైన వధువు .!

సోనిపట్: హర్యానాలోని సోనిపట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను కోరుకున్న మారుతి బ్రెజ్జా కారు ఇవ్వలేదనే కారణంతో ఓ వరుడు పెళ్లికి నిరాకరించి, కుటుంబ సభ్యులతో కలిసి వెనుదిరిగాడు. దీంతో పెళ్లి వేడుక విషాదంగా మారింది. పెళ్లి దుస్తుల్లోనే వధువు మండపంలో వరుడి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. సోనిపట్‌లోని మామ్‌చంద్ వాటికలో నవంబర్ 20న హీనా అనే యువతికి ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేస్తున్న కుల్దీప్‌తో వివాహం జరగాల్సి ఉంది. ఆరు నెలల క్రితమే ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అయితే, పెళ్లి ఖరారైనప్పటి నుంచి వరుడి కుటుంబం కారు, బంగారు నగలు తదితర డిమాండ్లు చేస్తున్నట్లు వధువు తండ్రి సుభాష్ కుమార్ ఆరోపించారు.

వరుడి కోసం సుమారు రూ.9.5 లక్షల విలువైన హ్యుండాయ్ ఆరా కారును ఇప్పటికే బుక్ చేశామని, అయితే పెళ్లికి ఒక్కరోజు ముందు తనకు ఆ కారు నచ్చలేదని, రూ.13 లక్షల విలువైన మారుతి బ్రెజ్జా కావాలని కుల్దీప్ కోరినట్లు తెలిపారు. దీంతో పాత బుకింగ్ రద్దు చేసి కొత్త కారు కోసం ప్రయత్నించినప్పటికీ సమయానికి ఏర్పాటు చేయలేకపోయామని చెప్పారు.

కారు మాత్రమే కాకుండా వరుడికి రెండు తులాల బంగారు గొలుసు, అతని తల్లికి నాలుగు తులాల బంగారు చెవిపోగులు, ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఆభరణాలు కావాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి ఏర్పాట్లు, ఫర్నిచర్, విందు కోసం మొత్తం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తండ్రి వెల్లడించారు.

పెళ్లి రోజున సుమారు 1,200 మంది అతిథులకు ఏర్పాట్లు చేయగా, కుల్దీప్ తన తల్లితో కలిసి వేదికకు చేరుకుని బ్రెజ్జా కారు గురించి అడిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కారు ఏర్పాటు కాలేదని తెలియడంతో వధువు కుటుంబంతో వాగ్వాదానికి దిగి, పెళ్లి చేసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సుభాష్ తెలిపారు.

దీంతో పెళ్లికూతురు హీనా పెళ్లి దుస్తుల్లోనే మండపంలో ఉండిపోయింది. అనంతరం ఇరు కుటుంబాలు పోలీసులకు సమాచారం అందించాయి. వరుడు, అతని కుటుంబంపై చర్యలు తీసుకోవాలని సుభాష్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల తదుపరి చర్యలు తెలియాల్సి ఉంది.