హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావడం పక్కా అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోటి ఓట్లు, 90 సీట్లతో అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో 2023 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లామని.. కాంగ్రెస్ ఓటింగ్ శాతాన్ని మూడు నుంచి అధికారం దాకా తీసుకొచ్చామన్నారు. రెండోసారి అధికారమే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నేతలు క్షేత్రస్థాయిలో కష్టపడాలని.. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు మేం చూసుకుంటామని పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 240 కంటే ఎక్కువ సీట్లు రావని తాను ముందే చెప్పానని.. చివరకు అదే నిజమైందని గుర్తు చేశారు.
ఆదివారం (నవంబర్ (22) గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నయానో.. భయానో అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ నాయకులను బెదిరించింది. బీఆర్ఎస్ అక్రమ కేసులు పెట్టిన కార్యకర్తలు తట్టుకుని నిలబడ్డారు. కేసులను ధైర్యంగా ఎదుర్కొని కాంగ్రెస్ గెలుపు కోసం పోరాడారు. కార్యకర్తలతో కృషి, శక్తి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే లేదని కేసీఆర్ విర్రవీగారు. కానీ బీఆర్ఎస్ను గద్దె దించి అధికారంలోకి వచ్చాం. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి రావాలంటే పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం చేసే నాయకుడు అవసరం.. అందుకే అధిష్టానం సందీప్‌ను తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్‌గా పంపించింది.
తెలంగాణలో రెండో సారి అధికారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలి. పార్టీని విశ్వసించి రాహుల్ నాయకత్వాన్ని నమ్మాలి. కచ్చితంగా రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ప్రజల మధ్య ఉండి పోరాడిన వాళ్లే నాయకులు అవుతారు. మీ శ్రమ చిత్తశుద్ధితోనే పదవులు వస్తాయి. కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పదవులు వస్తాయి. ప్రతి నాయకుడి మాట తీరు, ప్రవర్తనా అన్నీ గమనిస్తున్నాం.. ముందు ఏం మాట్లాడుతున్నారు.. వెనక ఏం మాట్లాడుతున్నారనేది మాకు అన్నీ తెలుసు. పార్టీ లైన్లో ఉన్నవారికి పదవులు ఆటోమేటిక్‌గా వస్తాయి.. గాంధీ భవన్ చుట్టూ తిరిగినంతా మాత్రాన పదవులు రావు. ఢిల్లీలో లాబీయింగ్ చేసిన వారికి కూడా పదవులు రావు’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
