హైదరాబాద్: సొంత పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతోన్న అసంతృప్త నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం (నవంబర్ (22) గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతి నాయకుడి మాట తీరు, ప్రవర్తనా అన్నీ గమనిస్తున్నామన్నారు. ముందు ఏం మాట్లాడుతున్నారు.. వెనక ఏం మాట్లాడుతున్నారనేది మాకు అన్నీ తెలుసని అన్నారు.
ప్రతి నాయకుడి ప్రోగ్రెస్ కార్డు మా దగ్గర ఉందని.. వచ్చే ఎన్నికల్లో మీ పని తీరు ఆధారంగానే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కష్టపడ్డోళ్లను పార్టీ పక్కాగా గుర్తిస్తుందని.. అలాగే, పార్టీ పేరును చెడగొట్టేవాళ్లను కూడా గుర్తిస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలైన్లో ఉన్నోళ్లకు పదవులు, టికెట్లు ఇంటికే వస్తాయని స్పష్టం చేశారు.
గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని.. ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయంటే కుదరని హెచ్చరించారు. పైరవీల మీద పెట్టే దృష్టి ప్రజలపై పెట్టాలని లీడర్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో తిరిగి ఎవరైతే పేదలకు బంధువు అవుతారో వాళ్లే నిజమైన లీడర్లు అని అన్నారు. తాను పీసీసీ చీఫ్ అయ్యేనాటికి తెలంగాణలో కాంగ్రెస్ ఓటు శాతం 6 ఉందని.. అది నేడు 40 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓట్ షేర్ పెరగడం కార్యకర్తల కృషేనని సీఎం కొనియాడారు.
తెలంగాణలో రెండోసారి అధికారం పక్కా:
తెలంగాణలో రెండోసారి అధికారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీని విశ్వసించి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నమ్మాలని కోరారు. కచ్చితంగా తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ గెలుపు కోసం నాయకులు, లీడర్లు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు తాము చూసుకుంటామని చెప్పారు. ప్రజల మధ్య ఉండి పోరాడిన వాళ్లే నాయకులు అవుతారని.. మీ శ్రమ చిత్తశుద్ధితోనే పదవులు వస్తాయన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుతోందని భరోసా ఇచ్చారు.
