కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ .. 500 రోజుల్లో BRS అధికారంలోకి వస్తది: కేటీఆర్

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ .. 500 రోజుల్లో BRS  అధికారంలోకి వస్తది: కేటీఆర్

వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, మరో 500 రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ జనచైతన్య బహిరంగ సభలో కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మహిళలను కోటీశ్వరులను చేయడం పక్కనపెట్టి కనీసం లక్షాధికారులుగా చేసి చూపించాలని సవాల్ విసిరారు. మహిళలను లక్షాధికారులను చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలకు గులాంలుగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ నేతలు అమిత్ షా కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, బూతులు మాట్లాడటం తప్ప అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డివి తుగ్లక్ ఆలోచనలని విమర్శించారు.

వరంగల్‌తో బీఆర్ఎస్‌కు ప్రత్యేక అనుబంధం

ఉద్యమ సమయం నుంచి వరంగల్‌తో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌కు వరంగల్ ఎప్పుడూ అండగా నిలిచిందని, ఇక్కడ నిర్వహించిన ప్రతి సభ విజయవంతమైందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా వచ్చినప్పటికీ సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎలాంటి అబద్ధపు హామీలు ఇవ్వలేదన్నారు.

వరంగల్‌కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, భవిష్యత్తులో వరంగల్‌ను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ నగరానికి చేసిందేమీ లేదని, ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. వరంగల్ ఐటీ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు.

వరంగల్‌లో కేసీఆర్ హయాంలో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిని ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించలేదని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తయిందని చెప్పారు. కేసీఆర్ నిర్మించిన అభివృద్ధి పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించలేకపోతోందని విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 లక్షల 71 వేల పెన్షన్లు తొలగించిందని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమం సున్నా, అభివృద్ధి గుండు సున్నా అంటూ విమర్శించారు. మోసపోతే గోస పడతామని కేసీఆర్ ఆనాడే ప్రజలను హెచ్చరించారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ నేతలపైనే అవినీతి ఆరోపణలు

కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలే తమ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని చెబుతున్నారని అన్నారు. మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కూడా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారని ప్రస్తావించారు.

రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ, వారి పిల్లల కోసం ఇంటర్మీడియట్ కళాశాలలను తొలగిస్తున్నారంటూ ఆరోపించారు. వరంగల్ అభివృద్ధికి తన గడ్డం అడ్డొస్తుందా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

వరంగల్‌లో భారీ చేరికలు ఉంటాయి

వరంగల్ జిల్లాలో త్వరలో బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు ఉంటాయని కేటీఆర్ ప్రకటించారు. కాళోజీ కళాక్షేత్రంలో కుడా కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి, బీఆర్ఎస్ సభ ఉందని తెలియగానే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ లేదని, వరంగల్‌దే భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మరోసారి గుర్తు చేసుకోవాలని కోరారు. 2028లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు