గత కొద్దిరోజులుగా బెంగుళూరులోని యలహంకలో ఉన్న జగన్ ప్యాలెస్ చుట్టూ హైడ్రామా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ( నవంబర్ 22 ) షర్మిల జగన్ ఇంటి దగ్గర భారీ ధర్నాకు సిద్ధమైందని వార్తలు రావడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అయితే.. యలహంక ప్యాలెస్ లో షర్మిల జోక్యం చేసుకోవద్దంటూ జగన్ పిటిషన్ దాఖలు చేయడం.. అందుకు అనుగుణంగా దేవనహళ్లి కోర్టు తీర్పు వెల్లడించడంతో షర్మిలకు షాక్ తగిలింది. ఈ క్రమంలో ఇవాళ బెంగళూరుకు వెళ్లిన షర్మిలను ఎయిర్ పోర్టు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. యలహంక ప్యాలెస్ కు వెళ్లకుండా నిలువరించారు పోలీసులు.
ఈ క్రమంలో ఎయిర్ పోర్టు దగ్గర పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన కూతురు అంజలి వివాహ ఏర్పాట్లకు సంబంధించి తన తల్లి విజయమ్మ, కొడుకు కోడలితో కలిసి బెంగుళూరు చేరుకున్నారు షర్మిల. అయితే.. యలహంక వైపు వెళ్లే మార్గాన్ని కాదని, షర్మిల వాహనాలను వాహనాలను బెంగళూరు సిటీ వైపు మళ్లించారు పోలీసులు.
కోర్టు ఆదేశాలను పాటించాలని సూచిస్తూ షర్మిలను బెంగుళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌కు తరలించారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టుతో పాటు.. యలహంక ప్యాలెస్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
