వెయ్యి కోట్ల సైబర్ స్కామ్.. హైదరాబాద్ పోలీసుల అదపులో మరో ఇద్దరి అరెస్ట్!

వెయ్యి కోట్ల సైబర్ స్కామ్.. హైదరాబాద్ పోలీసుల అదపులో మరో ఇద్దరి అరెస్ట్!
  • హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల అదపులో సత్తుపల్లికి చెందిన 
  • బొప్పన ఖాదర్ బాబా, నాగ పవన్ 

ఖమ్మం, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన భారీ సైబర్ స్కామ్ కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో శనివారం సత్తుపల్లికి చెందిన బొప్పన ఖాదర్ బాబా, బొప్పన నాగ పవన్ అనే మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న వీరిని శనివారం ఉదయం సత్తుపల్లి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని తిరువూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. నాంపల్లి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.

అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో సంబంధాలు

సత్తుపల్లి కేంద్రంగా వెలుగుచూసిన ఈ భారీ సైబర్, ఆర్థిక నేరాల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో సంబంధాలు ఏర్పరచుకున్న నిందితులు ఆస్ట్రేలియా, కంబోడియా తదితర దేశాల్లో కాల్ సెంటర్లను నిర్వహిస్తూ వివిధ దేశాలకు చెందిన వ్యక్తులను మోసగించినట్లు గతంలో దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ మోసాల ద్వారా వచ్చిన సొమ్మును మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసి, అనంతరం నగదుగా మార్చుకున్నట్లు గుర్తించారు.

ఒక్క ఖాతాలోనే రూ.135.48 కోట్ల లావాదేవీలు

ఈ భారీ సైబర్ నేరాల వ్యవహారానికి సంబంధించి వీఎం బంజర్, సత్తుపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత జనవరిలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఇప్పటివరకు 55 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. మేడా సతీశ్ బ్యాంకు ఖాతా ద్వారా ఏకంగా రూ.135.48 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గతంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. ఈ కేసులో సతీశ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆయన సోదరి భానుప్రియ, బావ మనోజ్ కల్యాణ్ కూడా అరెస్టయ్యారు.

నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు?

తాజాగా బొప్పన ఖాదర్ బాబా, బొప్పన నాగ పవన్ అరెస్టుతో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసిన అధికారులు, తాజాగా పట్టుబడిన ఇద్దరి ద్వారా మరిన్ని ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, అంతర్జాతీయ సంబంధాలపై కీలక సమాచారం సేకరించే అవకాశం ఉంది. వెయ్యి కోట్లకు పైగా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సైబర్ నేరాల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? మోసాల సొమ్ము ఎక్కడెక్కడికి మళ్లింది? ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అన్నది తదుపరి దర్యాప్తులో తేలాల్సి ఉంది.

కీలక ఆధారాలు స్వాధీనం

గత అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ నుంచి వచ్చిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు డీఎస్పీ కేవీఎం ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసుల సహకారంతో సత్తుపల్లి ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. సత్తుపల్లికి చెందిన బొప్పన నాగప్రసాద్, వేంసూరు మండలం రాజుగూడెంకు చెందిన మేడా సతీశ్ ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. బొప్పన నాగప్రసాద్ ఇంటి నుంచి మెర్సిడెస్ బెంజ్ కారు, ఆరు సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, రెండు ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, స్థిరాస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మేడా సతీశ్ ఇంట్లోనూ స్థిరాస్తి పత్రాలను అధికారులు సీజ్ చేశారు.