- తొలి విడతలో భారీ మౌలిక వసతుల అభివృద్ధి పనులు
- హాస్టళ్లు, మోడ్రన్ కిచెన్, డైనింగ్ హాళ్లకు రూ.270 కోట్లు
- అకడమిక్, రీసెర్చ్ బ్లాకుల నిర్మాణానికి రూ.210 కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.480 కోట్ల అంచనా వ్యయంతో భారీ మౌలిక సదుపాయాల పనులను చేపట్టనుంది. ఓయూ క్యాంపస్‌లో నూతన హాస్టళ్లు, అకాడమిక్, రీసెర్చ్ బ్లాకుల నిర్మాణానికి తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ నోటిఫికేషన్లు విడుదల చేసింది.
గతంలో ఓయూను దర్శించిన సందర్భంగా క్యాంపస్‌ను ఆధునీకరించి, విద్యార్థులకు అత్యాధునిక వసతులు కల్పించేందుకు రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ విజన్‌ను ఆచరణలోకి తెస్తూ, హైదరాబాద్‌లోని టీజీఈడబ్ల్యూఐడీసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయం రెండు భారీ ప్యాకేజీలుగా నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించింది. ఈ నిర్మాణాలతో క్యాంపస్‌లో విద్యార్థుల సంక్షేమం, అకడమిక్ ఎక్సలెన్స్, పరిశోధనలకు కొత్త ఊతం లభించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఓయూ ప్రతిష్ట మరింత పెరగనుంది.
హాస్టళ్లకు రూ.270 కోట్లు.. అకాడమిక్, ఆర్ అండ్ డీకి రూ.210 కోట్లు..
మొత్తం రూ.480 కోట్ల నిధుల్లో రూ.270 కోట్లను విద్యార్థుల వసతి, భోజన సదుపాయాల కోసమే కేటాయించారు. దీనిలో భాగంగా ఓయూ క్యాంపస్‌లో బాలికల కోసం ప్రత్యేక హాస్టల్, ఆధునిక కిచెన్, డైనింగ్ హాళ్లతో పాటు బాలుర కోసం మరో హాస్టల్, మోడ్రన్ కిచెన్ అండ్ డైనింగ్ హాళ్లను నిర్మించనున్నారు. ఏండ్లుగా క్యాంపస్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి, మెస్ ఇబ్బందులకు ఈ నూతన భవనాలతో శాశ్వత పరిష్కారం లభించనుంది. మరో రూ.210 కోట్లతో యూనివర్సిటీలో బోధన, అభ్యసన, పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా క్యాంపస్‌లో అకాడమిక్ అండ్ న్యూ డిపార్ట్మెంట్స్ బ్లాక్ నిర్మాణంతో పాటు ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) బ్లాక్‌ను నిర్మించనున్నారు. కొత్త విభాగాలకు సరిపడా తరగతి గదులు, అత్యాధునిక పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుంది.
విద్యార్థుల చిరకాల సమస్యలకు పరిష్కారం: వీసీ
ఓయూలో రూ.480 కోట్ల పనులకు టెండర్లు పిలవడంపై ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడంలో ఇదొక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. విద్యార్థుల చిరకాల సమస్యలను పరిష్కరించి, ఆధునిక, విద్యార్థి హితమైన విద్యా వాతావరణాన్ని సృష్టించే దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు అని తెలిపారు. ఈ సదుపాయాలను వీలైనంత త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ప్రకటించిన రూ.1,000 కోట్ల ప్యాకేజీలో భాగమైన మిగతా అభివృద్ధి పనులను కూడా త్వరలోనే ముందుకు తీసుకెళ్తామని వీసీ వెల్లడించారు.
డిసెంబర్ 11 వరకు టెండర్లు
ఈ రెండు నిర్మాణ ప్యాకేజీలకు సంబంధించి అర్హులైన కాంట్రాక్టర్లు డిసెంబర్ 11 సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేయవచ్చని టీజీఈడబ్ల్యూఐడీసీ తెలిపింది. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు టెక్నికల్ బిడ్‌ను, డిసెంబర్ 16 సాయంత్రం 4 గంటలకు ప్రైస్ బిడ్‌ను తెరవనున్నారు. పూర్తి వివరాల కోసం https://tender.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
