పుష్కర లోగో, ట్యాగ్‌‌లైన్‌‌ కు రూ.లక్ష ప్రైజ్!..గోదావరి పుష్కరాల పోటీలకు దేవాదాయశాఖ ఆహ్వానం

పుష్కర లోగో, ట్యాగ్‌‌లైన్‌‌ కు రూ.లక్ష ప్రైజ్!..గోదావరి పుష్కరాల పోటీలకు దేవాదాయశాఖ ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం అధికారిక లోగో, ట్యాగ్‌‌లైన్ రూపొందించేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ పోటీలు నిర్వహిస్తోంది. ఇందుకు18 ఏండ్లు నిండిన వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. లోగో గోదావరి నది ఆధ్యాత్మిక ప్రాధాన్యం, పుష్కరాల సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని పేర్కొంది. వెబ్‌‌సైట్లు, హోర్డింగ్స్, అన్ని రకాల ప్రకటనలకు అనువుగా లోగో ఉండాలి. ట్యాగ్‌‌లైన్ భక్తులను సులభంగా ఆకట్టుకునేలా తెలుగు లేదా ఆంగ్లం లేదా రెండు భాషల్లో సమర్పించాలి. 

పోటీలో ప్రథమ విజేతకు రూ.లక్ష, ద్వితీయ విజేతకు రూ.50 వేలు, తృతీయ విజేతకు రూ.25 వేల నగదు బహుమతి ఇస్తారు.ఆసక్తి గలవారు ఈ నెల 30 సాయంత్రం 5 గంటల్లోపు [email protected] కు ఈ-మెయిల్ ద్వారా ఎంట్రీలు పంపాలి. దేవాదాయశాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు పేరిట బొగ్గులకుంటలోని తిలక్ రోడ్డు దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపాలని కోరారు. పూర్తి మార్గదర్శకాలు, నిబంధనలు https://endowments.ts.nic.in/ వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.