అయ్యప్ప భక్తులకు అలర్ట్.. హెల్త్ గైడ్‌ లైన్స్ జారీ చేసిన కేరళ సర్కార్..!

అయ్యప్ప భక్తులకు అలర్ట్.. హెల్త్ గైడ్‌ లైన్స్ జారీ చేసిన కేరళ సర్కార్..!

శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తుల కోసం కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. కొండ ఎక్కే సమయంలో భక్తులు అధిక శ్రమకు గురికావద్దని, వైద్యుల సలహాలను పాటించాలని సూచించింది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు యాత్ర ప్రారంభించే ముందు వైద్య పరీక్షలు చేయించుకుని, డాక్టర్ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాలని అధికారులు స్పష్టం చేశారు.

ఇటీవల హార్ట్ ఎటాక్ వచ్చిన వారు, గుండె శస్త్రచికిత్స లేదా యాంజియోప్లాస్టీ చేయించుకున్న వారు నిపుణుల సలహా లేకుండా యాత్రకు రావద్దని ఆరోగ్య శాఖ తెలిపింది. బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవాలని, రెగ్యులర్‌గా వాడుతున్న మందులను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించింది. మందులతో పాటు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కూడా దగ్గర పెట్టుకోవాలని పేర్కొంది.

మెట్లు ఎక్కే సమయంలో భక్తులు తమ శారీరక సామర్థ్యాన్ని బట్టి నడవాలని, వేగంగా వెళ్లడానికి ప్రయత్నించవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ, తగినంత నీరు తాగాలని సూచించింది. ఖాళీ కడుపుతో కొండ ఎక్కకూడదని, అయితే గుండె సమస్యల కారణంగా నీరు తక్కువగా తాగాలని డాక్టర్లు సూచించిన వారు ఆ నియమాన్ని పాటించాలని ఒక ప్రకటనలో తెలిపింది.

నడిచే సమయంలో తోపులాటల్లో వెళ్లడం లేదా పరుగెత్తడం చేయకూడదని అధికారులు భక్తులను కోరారు. ఒకవేళ నడుస్తున్నప్పుడు ఛాతిలో నొప్పి లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే ఆగిపోయి వైద్య సహాయం కోరాలని సూచించారు.

కార్డియాక్ ఎమర్జెన్సీ లక్షణాలు ఇవే:

ఛాతిలో నొప్పి, బరువుగా అనిపించడం లేదా ఒత్తిడి, ఊపిరి ఆడకపోవడం, విపరీతంగా చెమట పట్టడం, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం, గుండె కొట్టుకోవడంలో తేడాలు ఉండటం, అకస్మాత్తుగా తీవ్రమైన అలసట రావడం వంటివి కార్డియాక్ ఎమర్జెన్సీకి సంకేతాలు కావచ్చని ఆరోగ్య శాఖ వివరించింది. నొప్పి చేతులు, దవడ లేదా వీపు భాగాలకు పాకుతున్నట్లు అనిపించినా అప్రమత్తం కావాలని తెలిపింది.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నడక ఆపేసి, సురక్షితమైన చోట విశ్రాంతి తీసుకోవాలని అధికారులు సూచించారు. సమీపంలోని ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్‌ను సంప్రదించాలని, అవసరమైతే ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. అత్యవసర సహాయం కోసం భక్తులు 04735 203232 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు.

నవంబర్ 17న ప్రారంభమైన శబరిమల మండల పూజ సీజన్ డిసెంబర్ 27 వరకు కొనసాగుతుంది. అనంతరం మకరవిలక్కు యాత్ర కోసం డిసెంబర్ 30న ఆలయం తిరిగి తెరుచుకుంటుంది. జనవరి 14న మకరవిలక్కు పండుగ నిర్వహించనుండగా, జనవరి 19 వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. జనవరి 20న ఆలయం మూసివేస్తారు. భక్తులు భద్రతా నిబంధనలు పాటిస్తూ యాత్రను పూర్తి చేయాలని కేరళ ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.