- కేసీఆర్ సంతకంతోనే ఆ రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు
- జగన్, కేసీఆర్ టైంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ మొదలు
- ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పీఏసీ మీటింగ్‌లో ఫైర్
- ఎల్‌నినోను జాతీయ విపత్తుగా పరిగణించాలి
- కేంద్రం రూ.30 వేల కోట్లు సాయం చేయాలని తీర్మానం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనే తెలంగాణ నీటిని ఏపీకి యథేచ్ఛగా తరలించుకుపోయారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను 299 టీఎంసీలకే పరిమితం చేస్తూ అప్పటి సీఎం కేసీఆర్ సంతకం పెట్టారన్నారు. ఆ ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని చెప్పారు.
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ మన నీటిని దోపిడీ చేసేలా ఒక్క ప్రాజెక్టునూ నిర్మించలేదని పేర్కొన్నారు. ఆదివారం గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ( పీఏసీ ) సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘‘పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మొదలైంది. ఆ పార్టీ పదేళ్ల పాలనలోనే తెలంగాణ నీటిని ఏపీ యథేచ్ఛగా తరలించుకుపోయింది. ఎన్నో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించింది. తెలంగాణలో ప్రాజెక్టుల భూ సేకరణకు కూడా కేసీఆర్ నిధులు మంజూరు చేయలేదు.
2022 లో కేసీఆర్, వైఎస్ జగన్ రెండు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నప్పుడే పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం మొదలైంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై అడ్డగోలుగా, పచ్చి అబద్ధాలతో ఆరోపణలు చేస్తున్నారు’’ అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ జాతీయ నేతల తప్పుడు ఆరోపణలను పార్టీ నేతలు తిప్పికొట్టాలని సూచించారు.
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడొద్దు
ఎన్నికల వరకు సందీప్ తెలంగాణకు ఇన్‌చార్జిగా ఉంటారన్నారు. పీఏసీ సమావేశంలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, అనిరుధ్‌రెడ్డిల అంశం చర్చకు వచ్చింది. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు కోరారు. ఈ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుంటూ.. ఈ ఒక్కసారికి వదిలేద్దామని సూచించారు. మళ్లీ పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జనగణనలో కుల గణన చేయాలి
వందేళ్ల తర్వాత తొలిసారి తెలంగాణలో ఓబీసీ కులగణన నిర్వహించామని, 2027లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కూడా ఓబీసీ కులగణన చేర్చాలని సీఎం డిమాండ్ చేశారు. ఈ సమావేశం ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని, ప్రధానమంత్రి మోదీకి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సీఎం సూచించారు.
30 వేల కోట్ల సాయం అందించాలి
ఎల్‌నినోను జాతీయ విపత్తుగా ప్రకటించి, రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరుతూ మరో తీర్మానం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవడం లేదని, రైతులు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేదని, వర్షాకాలంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు సరఫరా చేసి పంటలు ఎండిపోకుండా చూశామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలు ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలోనూ కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు.
సంక్రాంతి తర్వాత ప్రజాబలం కార్యక్రమం
సంక్రాంతి తర్వాత ఐదు నెలల పాటు ‘ప్రజాబలం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ప్రతి గ్రామానికీ వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. నిధుల కొరత లేకుండా పనిచేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇచ్చామని చెప్పారు. కార్యకర్తల కోసం, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ఆబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని పీఏసీ తీర్మానించింది. కాగా, పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
అనిరుధ్ రెడ్డి హాజరుకాలేదు.
కొత్త ఇన్‌చార్జికి ఘన స్వాగతం
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా నియమితులైన బీఎం సందీప్ ఆదివారం తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి
ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాలన్నది నెహ్రూ, మహాత్మాగాంధీ, అంబేద్కర్ ఆశయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హక్కును ప్రజలకు కల్పించిందని పేర్కొన్నారు. 2019లో 130 కోట్ల జనాభాకు 91 కోట్ల ఓటర్లు ఉండగా, 2024లో 140 కోట్ల జనాభాకు 97.5 కోట్ల ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఎస్‌ఐఆర్ పేరుతో కనీసం 20 కోట్ల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని, ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపించారు.
వలసల పేరుతో దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఓట్లను తొలగిస్తున్నారని, తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని అన్నారు. ఇంటిపేరు సరిగా లేకపోయినా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
