- చిన్న చేపలు చిక్కాయి.. పెద్దలు సేఫ్
- లాగిన్ ఎమ్మార్వోది..ఎంట్రీ వేరొకరిది
- 22 వేల లావాదేవీలపై ఫోరెన్సిక్ అనుమానం
- భూ భారతిలోనూ తలుపులు తట్టిన పాత ముఠా
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల నిర్వహణ కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో జరిగిన భారీ అక్రమాల డొంక కదులుతుండగా, ఇప్పుడు కొత్తగా తెచ్చిన 'భూ భారతి' పోర్టల్‌ను సైతం అక్రమార్కులు టార్గెట్ చేయడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. ధరణిలో తహసీల్దార్లు, ఇతర అధికారిక లాగిన్‌లను ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా వాడుకుని భూ రికార్డులను తారుమారు చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్, సీఐడీ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. పాత పోర్టల్ స్థానంలో ప్రవేశపెట్టిన భూ భారతి సాఫ్ట్‌వేర్‌లోనూ అవే సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని అనధికారికంగా లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
భూ భారతిలోనూ అవే ప్రయత్నాలు.. కొల్లూరు కేసుతో కలకలం
ధరణి అక్రమాలకు చెక్ పెట్టేందుకు 2025 ఏప్రిల్ 14న ప్రారంభించిన 'భూ భారతి' పోర్టల్‌లోనూ పాత ముఠాలు మళ్లీ తమ చేతివాటం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుండడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ ఆడిట్ పూర్తిస్థాయిలో జరగకపోవడం, పాత డేటాబేస్‌ను అలాగే అనుసంధానించడం వల్ల అక్రమార్కులు సులభంగా చొరబడేందుకు వీలు చిక్కుతోంది.
ఇటీవల సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రూ.90 కోట్ల విలువైన భూమి రికార్డులను అక్రమంగా మార్చేసిన ఉదంతం వెలుగులోకి రావడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. సాఫ్ట్‌వేర్‌లోని బ్యాక్-ఎండ్ లోపాలను ఉపయోగించి అనధికారికంగా లాగిన్ అయ్యేందుకు ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసి విచారించగా, ధరణిలో పనిచేసిన నెట్‌వర్క్ ఇప్పుడు భూ భారతి పోర్టల్‌లోనూ లోపాలను వెతుకుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
కొల్లూరులో బయటపడిన రూ.90 కోట్ల విలువైన భూమార్పిడి వ్యవహారంతో కొత్త పోర్టల్ భద్రతా డొల్లతనం బట్టబయలైంది. సీఐడీ డీజీ చారుసిన్హా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ప్రత్యేక విచారణ కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ సిట్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారులైన 'సూపర్ లాగిన్' పెద్దలను పక్కనబెట్టి, కేవలం కిందిస్థాయి ఆపరేటర్లు, రెవెన్యూ అధికారుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మార్వో లాగిన్లు.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి!
ధరణి పోర్టల్ నిర్వహణలో అత్యంత కీలకమైన తహసీల్దార్లు, ఇతర అధికారిక లాగిన్ పాస్‌వర్డ్‌లు, ఇతరుల చేతుల్లోకి వెళ్లినట్లు సీఐడీ దర్యాప్తులో స్పష్టమైంది. కొన్నిచోట్ల అధికారుల ప్రమేయం లేకుండా అంటే వారికి తెలియకుండానే వారి లాగిన్ క్రెడెన్షయల్స్తో భూమార్పిడికి పాల్పడినట్లు తెలిసింది. ఉదాహరణకు ఒక మండల తహాసీల్దార్‌కు సంబంధించిన లాగిన్ ఐడీ, పాస్వర్డ్ తో ఆ మండలానికి సంబందించిన భూముల వివరాలు, వివిధ మాడ్యుల్ అప్లికేషన్లను ధరణి పోర్టల్‌లో ప్రాసెస్ చేసేవాళ్లు.
అయితే బ్యాక్ ఎండ్‌లో అయ్యే సూపర్ లాగిన్‌తో సదరు మండల తహసీల్దార్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండానే మండల లాగిన్ లో డిజిటల్ ఫుట్ ప్రింట్స్‌తో భూముల వివరాలు మారిపోయినట్లు గుర్తించారు. ఇక మరికొన్ని చోట్ల తహసీల్దార్ల అండదండలతోనే 'అదర్ పర్సన్స్' పోర్టల్‌లోకి ప్రవేశించి, అర్ధరాత్రి వేళల్లో భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఒక మండల తహసీల్దార్ లాగిన్‌లోకి ప్రవేశిస్తే, రాష్ట్రంలోని ఏ జిల్లా భూముల సమాచారాన్నైనా యాక్సెస్ చేసేలా సాఫ్ట్‌వేర్‌లో తీవ్ర లోపాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ సాంకేతిక లొసుగులను అడ్డుపెట్టుకుని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్ భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్లపైకి బదిలీ చేశారు.
జిన్నారం, రామచంద్రాపురం, పటాన్‌చెరు, కొల్లూరు, తెల్లాపూర్ వంటి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అసైన్డ్ భూములను ఏకంగా పట్టా భూములుగా రికార్డుల్లో మార్చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఐపీ అడ్రస్‌లు, లాగిన్ హిస్టరీని పరిశీలించినప్పుడు, ఆఫీసు సమయం ముగిసిన తర్వాత వేరే ప్రాంతాల నుంచి లాగిన్ అయినట్లు స్పష్టంగా రికార్డయింది.
లోపభూయిష్ట సాఫ్ట్‌వేర్.. రాష్ట్ర భూముల డేటాకు ముప్పు
కోట్లాది మంది రైతుల ఆస్తులకు రక్షణ కవచంగా ఉండాల్సిన భూ రికార్డుల సాఫ్ట్‌వేర్ అత్యంత లోపభూయిష్టంగా ఉండటం ఇప్పుడు రాష్ట్ర డేటా భద్రతకే పెను సవాలుగా మారింది. పోర్టల్ టెండర్ల కేటాయింపు నుంచి సిస్టమ్ ఆర్కిటెక్చర్, సోర్స్ కోడ్ నిర్వహణ వరకు ప్రైవేటు సంస్థలకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని సీఐడీ విచారణలో తేలింది.
2020 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య ధరణిలో జరిగిన సుమారు 8 లక్షల భూ లావాదేవీలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయగా, అందులో దాదాపు 22 వేల లావాదేవీలు అనుమానాస్పదంగా గుర్తించారు. సోర్స్ కోడ్‌లోకి నేరుగా చొరబడి, ఎలాంటి పత్రాలు, చలాన్లు లేకుండానే భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, బై నంబర్లను మార్చేసినట్లు నిర్ధారణ అయింది.
భూ భారతి పోర్టల్‌లోనూ పటిష్టమైన టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఐపీ రెస్ట్రిక్షన్స్ లేకపోవడంతో, పాత సాఫ్ట్‌వేర్ తరహాలోనే డేటా ట్యాంపరింగ్ జరిగే ప్రమాదం పొంచి ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని కోట్ల ఎకరాల భూముల మాస్టర్ డేటా ప్రైవేటు వ్యక్తుల సర్వర్లలో భద్రంగా ఉందా లేదా అనే అంశంపై సీఐడీ లోతుగా ఆరా తీస్తోంది.
‘సూపర్ లాగిన్’ గుట్టు విప్పడంలో తీవ్ర జాప్యం
భూ కుంభకోణంలో కీలకమైన 'సూపర్ లాగిన్' (అడ్మిన్ యాక్సెస్) ఎవరి చేతుల్లో ఉంది. దాని ద్వారా ఎవరెవరు మార్పులు చేశారనేది కనిపెట్టడంలో సీఐడీ విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ లాగిన్లకు కూడా అతీతంగా, నేరుగా పోర్టల్ బ్యాక్-ఎండ్‌లో మార్పులు చేసే 'సూపర్ అడ్మిన్' లాగిన్ గత ప్రభుత్వ హయాంలో కొందరు అత్యున్నత స్థాయి వ్యక్తుల కనుసన్నల్లో నడిచినట్లు ఆరోపణలున్నాయి.
అయితే, ఆ సూపర్ లాగిన్ ఐపీ అడ్రస్‌లు, సర్వర్ లాగ్స్‌ను పోర్టల్ నిర్వహించిన ప్రైవేటు కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశాయా లేదా విదేశీ సర్వర్ల ద్వారా ఆపరేట్ చేశారా అనే కోణంలో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. పోర్టల్ నిర్వహణ సంస్థల కార్యాలయాల్లో సీఐడీ సోదాలు నిర్వహించి కీలక హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నప్పటికీ, అసలు సూపర్ లాగిన్ సూత్రధారుల పేర్లను బయటపెట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతిక ఆధారాల సేకరణ పేరుతో నెలల తరబడి విచారణ సాగదీస్తుండటంతో, కీలక ఆధారాలు మాయమయ్యే ప్రమాదం ఉందని రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దలు సేఫ్.. కిందిస్థాయి అధికారుల మెడకు ఉచ్చు
ధరణి, భూ భారతి అక్రమాలపై సీఐడీ 15 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తూ పలువురిని అరెస్ట్ చేసింది. కానీ, ఈ కుంభకోణంలో తెరవెనుక ఉండి చక్రం తిప్పిన రాజకీయ పెద్దలు, నాటి ఉన్నతాధికారులు దర్జాగా పక్కకు తప్పుకుంటుండగా, కేవలం కిందిస్థాయి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, కాంట్రాక్ట్ ఆపరేటర్ల మెడకు మాత్రమే ఉచ్చు బిగుసుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తమకు తెలియకుండానే తమ లాగిన్లు దుర్వినియోగం అయ్యాయని పలువురు ఎమ్మార్వోలు వాపోతున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో కేవలం ఆపరేటర్లు, స్థానిక రెవెన్యూ సిబ్బంది పేర్లనే నిందితులుగా చేరుస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా పొందిన బడా బాబులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, వారికి సహకరించిన సూపర్ లాగిన్ పెద్దలను వదిలేసి, చిన్న చేపలను మాత్రమే పట్టుకుంటున్నారనే విమర్శలు రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వరుసగా వెలుగుచూస్తున్న లాగిన్ దుర్వినియోగం ఘటనలతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం, భూ భారతి పోర్టల్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా కసరత్తు చేస్తోంది.
