విదేశీ కొలువుల్లో టామ్‌‌‌‌‌‌‌‌కామ్ రికార్డు ..16 దేశాల్లో 14,850 ఉద్యోగాలు.. వారిలో 90 శాతం మహిళలే: మంత్రి వివేక్

విదేశీ కొలువుల్లో   టామ్‌‌‌‌‌‌‌‌కామ్ రికార్డు ..16 దేశాల్లో 14,850 ఉద్యోగాలు.. వారిలో 90 శాతం మహిళలే: మంత్రి వివేక్
  •  వీసా, ప్రయాణ ఖర్చులకు 50 శాతం సాయం..
  • విదేశీ ఉపాధికి రూ.50 కోట్ల బడ్జెట్
  •  గాంధీనగర్ చింతన్ శిబిరంలో తెలంగాణ ముద్ర..
  • శంషాబాద్‌‌‌‌‌‌‌‌లో 24 గంటల మైగ్రెంట్ హెల్ప్‌‌‌‌‌‌‌‌డెస్క్

 హైదరాబాద్, వెలుగు: దేశంలో కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, యువతకు దేశీయ, అంతర్జాతీయ ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సమన్వయం అత్యంత కీలకమని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని గాంధీనగర్‌‌‌‌‌‌‌‌లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల మంత్రుల రెండు రోజుల జాతీయ ‘చింతన్ శిబిరం’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

వికసిత్ భారత్ నిర్మాణంలో శ్రామిక శక్తి బలోపేతమే ధ్యేయంగా  రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న ఉపాధి కార్యక్రమాలను  వివరించారు. రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌‌‌‌‌‌‌పవర్ కంపెనీ (టామ్‌‌‌‌‌‌‌‌కామ్) ద్వారా ఇప్పటివరకు 16 దేశాల్లో ఏకంగా 14,850 మందికి విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించామని తెలిపారు. ఇందులో గల్ఫ్, యూకే, జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్, కెనడా వంటి దేశాల్లో ఉద్యోగాలు పొందిన వారిలో 90 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. కేంద్ర విదేశాంగ శాఖ గుర్తింపు పొందిన టామ్‌‌‌‌‌‌‌‌కామ్ ద్వారా వైద్యం, నిర్మాణం, రవాణా సహా 10 కీలక రంగాల్లో పూర్తి పారదర్శకత, భద్రతతో రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్లు చేపడుతుండటాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్‌‌‌‌‌‌‌‌సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ ఉద్యోగ నియామకాల్లో టామ్‌‌‌‌‌‌‌‌కామ్ సాధిస్తున్న ఫలితాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఫారిన్ లాంగ్వేజెస్ ట్రైనింగ్ కోసం రూ.20 కోట్లు

సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీమ్ (సీఎంఓఈఎస్) కింద రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించామని మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు.  గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ ఉన్న జర్మన్, జపనీస్, ఇంగ్లిష్ విదేశీ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు మరో రూ.20 కోట్లు కేటాయించామని చెప్పారు. 

ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ  భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 6 క్లస్టర్లలో ఉచిత జర్మన్ భాషా శిక్షణ ఇస్తున్నామని, దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారిక జర్మన్ లాంగ్వేజ్ టెస్టింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. విదేశీ ప్రభుత్వాలతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటూ.. జర్మనీ ఫెడరల్ ఏజెన్సీతో ‘ట్రిపుల్ విన్’ ద్వారా వైద్య నిపుణులను, ఇజ్రాయెల్ పాపులేషన్ అథారిటీతో నిర్మాణరంగ కార్మికులను పంపుతున్నామని పేర్కొన్నారు. అమాయక నిరుద్యోగులు ఫేక్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా శంషాబాద్ విమానాశ్రయంలో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక వలస కార్మికుల సహాయ కేంద్రాన్ని  ఏర్పాటు చేశామని వెల్లడించారు. 

హైదరాబాద్ సహా 8 సిటీల్లో కెరీర్ లాంజ్‌‌‌‌‌‌‌‌లు ప్రారంభం

విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించే ముందే ఆయా ఉద్యోగ ఆఫర్లు అసలైనవా కాదా, రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీలకు కేంద్ర అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలు నిర్ధారించుకునేలా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ‘కెరీర్ లాంజ్‌‌‌‌‌‌‌‌’లను టామ్‌‌‌‌‌‌‌‌కామ్ వంటి రాష్ట్ర సంస్థలతో అనుసంధానించాలని మంత్రి వివేక్ కేంద్రానికి సూచించారు. 

నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా ధ్రువీకరించిన విదేశీ ఖాళీల సమాచారాన్ని జిల్లా ఉపాధి కార్యాలయాలకు అనుసంధానించి కౌన్సెలింగ్, శిక్షణ ఇచ్చే పైలట్ ప్రాజెక్టును తెలంగాణలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 

కాగా, ఈ సదస్సు రెండో రోజు కేంద్ర మంత్రి మన్‌‌‌‌‌‌‌‌సుఖ్ మాండవీయ ఉద్యోగార్థులు, రాష్ట్రాల ఉపాధి పోర్టళ్లను ఏకం చేసేలా ఏఐ ఆధారిత చాట్‌‌‌‌‌‌‌‌బాట్, వాయిస్‌‌‌‌‌‌‌‌బాట్, ఆక్యుపేషనల్ షార్టేజ్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన ‘ఎన్‌‌‌‌‌‌‌‌సీఎస్ వన్’ పోర్టల్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు.

 అలాగే కార్మికులకు ఆహార, ఆరోగ్య, జీవిత బీమా, ప్రమాద బీమా, పింఛను వంటి 5 సామాజిక భద్రతలను కలిపే ‘ఈ-శ్రమ్ లైవ్లీహుడ్ ప్రొఫైల్ మాడ్యూల్’ను ప్రారంభించారు. హైదరాబాద్ సహా దేశంలోని 8 నగరాల్లో అత్యాధునిక ‘కెరీర్ లాంజ్’లను కేంద్ర మంత్రి వర్చువల్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.