- ఆకట్టుకున్న టెక్నికల్ ఎక్స్పో.. 400కు పైగా స్టాళ్ల ఏర్పాటు
- ఐఆర్సీ నూతన అధ్యక్షుడిగా సీబీ ఓజా ఎన్నిక
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సదస్సు శనివారం విజయవంతంగా ముగిసింది. దేశవిదేశాల నుంచి 3 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని రహదారి రంగం భవిష్యత్తుపై చర్చించారు. ఈ సదస్సులో మొత్తం 19 సాంకేతిక సమావేశాలు నిర్వహించారు.
రహదారి భద్రత, నాణ్యమైన నిర్మాణ సామగ్రి, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక సాంకేతికతల వినియోగం తదితర అంశాలపై నిపుణులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. దేశవ్యాప్తంగా రహదారి నెట్వర్క్ మన్నిక, భద్రతను మరింత పెంచేందుకు అవసరమైన వినూత్న విధానాలపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ వేడుకకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరై దిశానిర్దేశం చేశారు.
ఆకట్టుకున్న టెక్నికల్ ఎక్స్పో..
సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన సాంకేతిక ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో 400కు పైగా స్టాళ్ల ద్వారా రహదారి నిర్మాణ రంగంలోని సరికొత్త ఉత్పత్తులు, యంత్రాలు, సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించారు. దీంతోపాటు రాష్ట్ర ఘనమైన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలను పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది.
ఐఆర్సీ నూతన కార్యవర్గం ఇదే..
ఐఆర్సీ కౌన్సిల్‌కు నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులతోపాటు సభ్యులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా సీబీ ఓజా, ఉపాధ్యక్షులుగా బీఎస్ బాఘేల్, డాక్టర్ సి. రవిశేఖర్, ఆర్తి భార్గవ ఎన్నికయ్యారు. అలాగే సభ్యులుగా జస్వంత్ సింగ్, సంజయ్ కుమార్ ఖాండే, ఇర్ఫాన్ షఫీ పరీ, తుమ్మటి సీతారామయ్య, సత్యజిత్ దలై, ఆశిష్ కుమార్ శ్రీవాస్తవ, ప్రకాశ్ ఇంగోలే, హేమంత్ కుమార్ లిలాధర్ సుతార్, మెండు చక్రపాణి, సంజీవ్ కుమార్ శర్మ ఎన్నికైనట్లు నిర్వాహకులు తెలిపారు.
